న్యూఢిల్లీ: ఫాస్ఫేటిక్, పొటాషిక్ ఫెర్టిలైజర్ల దేశీయ ప్రొడక్షన్ పెంచేలా సబ్సిడీలు ఇవ్వాలని ప్రభుత్వం శనివారం నిర్ణయించింది. గ్లోబల్గా ఆ ఫెర్టిలైజర్ల రేట్లు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం ఒక కొత్త విధానాన్ని తీసుకు రానున్నట్లు తెలిపింది. కేంద్ర కెమికల్స్, ఫెర్టిలైజర్స్ శాఖ మంత్రి మన్షుఖ్ మాండవీయ నాయకత్వంలోని హైలెవెల్ మీటింగ్లో తాజా నిర్ణయం తీసుకున్నట్లు ఫెర్టిలైజర్స్ మంత్రిత్వ శాఖ ఒక స్టేట్మెంట్లో పేర్కొంది. ఆత్మనిర్భర్ భారత్ కింద ఫాస్ఫేటిక్, పొటాషిక్ ఎరువుల ప్రొడక్షన్ మన దేశంలోనే పెరిగేలా చొరవ తీసుకోవాలనుకుంటున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ (ఎన్బీఎస్) విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనిలో కొన్ని మార్పులు చేసి కొత్త విధానం తేనున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది. ఎన్బీఎస్ విధానాన్ని 2010 ఏప్రిల్ నుంచి దేశంలో అమలు చేస్తున్నారు. ఏడాదికి ఒకసారి సబ్సిడీని చెల్లిస్తున్నారు.
