ఏపీలో తెరచుకున్న ప్రభుత్వ పాఠశాలలు

ఏపీలో తెరచుకున్న ప్రభుత్వ పాఠశాలలు

విద్యార్థులు లేకుండా కేవలం టీచర్లకు మాత్రమే స్కూల్

విజయవాడ: ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు తెరచుకున్నాయి. విద్యార్థులు లేకుండా కేవలం టీచర్లు మాత్రమే హాజరుకావాలన్న విద్యాశాఖ ఆదేశాల మేరకు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్ల టీచర్లు హాజరయ్యారు. అయితే విద్యార్థులు లేకపోవడంతో చేసేదేమీ లేక టీచర్లు స్కూల్ ప్రాంగణాల్లో .. చెట్ల కింద.. స్టాఫ్ రూమ్ లలో ఖాళీగా కూర్చున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురుచూస్తూ గడిపారు.

            ఇప్పుడే స్కూళ్లు స్టార్ట్ చేయొద్దని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే.. ఏపీ ప్రభుత్వం మాత్రం విద్యార్థులు లేకున్నా టీచర్లు హాజరుకావాల్సిందేనంటూ హుకుం జారీ చేయడంపై ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బడులకు హాజరై ఖాళీగా కూర్చునే కంటే.. మార్గదర్శకాలు రూపొందించి ఇస్తే.. ఆన్ లైన్లో క్లాసులు చెబుతామంటున్నారు. బ్రిడ్జి కోర్సుపై సందేహాల నివృత్తి.. శిక్షణ కార్యక్రమాలు ఆన్ లైన్ లోనే చేయొచ్చని గుర్తు చేస్తున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. వాట్సప్.. ఈ మెయిల్ ద్వారా ఉన్నతాధికారులకు వినతిపత్రాలు పంపుతున్నారు. మరో వైపు విద్యాశాఖ ఆదేశాలను బహిష్కరించిన పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు విద్యాశాఖ ఉన్నతాధికారులను నేరుగా కలసి వినతిపత్రాలు అందజేశారు.