12 రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్

12 రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్

న్యూఢిల్లీ:డెల్టా ప్లస్​ రకం కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మొన్నటిదాకా 4 రాష్ట్రాల్లోనే ఉన్న డెల్టా ప్లస్​.. ఇప్పుడు 12 రాష్ట్రాలకు పాకింది. కేసులు 51కి పెరిగాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 22 డెల్టా ప్లస్​ కేసులు నమోదయ్యాయి. శనివారం ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. డెల్టా ప్లస్​ కేసులను గుర్తించేందుకు ఇప్పటిదాకా 45 వేల శాంపిళ్లను సీక్వెన్స్​ చేసినట్టు తెలిపింది. మహారాష్ట్ర తర్వాత తమిళనాడులో 9, మధ్యప్రదేశ్​లో 7, కేరళలో 3, పంజాబ్​, గుజరాత్​లలో రెండు చొప్పున డెల్టా ప్లస్​ కరోనా కేసులు వచ్చాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్​, ఒడిశా, రాజస్థాన్​, జమ్మూకాశ్మీర్​, హర్యానా, కర్నాటకల్లో ఒక్కో కేసు నమోదైందని చెప్పింది. ప్రస్తుతానికైతే కేసుల పెరుగుదల ఆందోళనకరంగా ఏమీ లేదని నేషనల్​ సెంటర్​ ఫర్​ డిసీజ్​ కంట్రోల్​ (ఎన్​సీడీసీ) డైరెక్టర్​ సుజీత్​ సింగ్​ తెలిపారు. డెల్టాలోనే మ్యుటేషన్లు జరిగి డెల్టా ప్లస్​గా మారిందని, అలాగని డెల్టా ప్లస్​ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని చెప్పలేమని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, ఢిల్లీ, హర్యానా, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్​, వెస్ట్​బెంగాల్​లలో శాంపిళ్లను టెస్ట్​ చేయగా.. సగానికిపైగా డెల్టా కేసులున్నట్టు తేలిందన్నారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా 12 దేశాల్లో డెల్టా ప్లస్​ కేసులున్నాయని ఇండియన్​ కౌన్సిల్​ ఆఫ్​ మెడికల్​ రీసెర్చ్​ (ఐసీఎంఆర్​) డైరెక్టర్​ జనరల్​ బలరాం భార్గవ చెప్పారు. వ్యాక్సిన్​ పనితనాన్ని తెలుసుకునేందుకు  డెల్టా ప్లస్​ను సీక్వెన్స్​ చేసినట్టు చెప్పారు. అన్ని వేరియంట్లపైనా వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తున్నట్టు చెప్పారు. కాగా, డెల్టా ప్లస్​తో ఓ మహిళ చనిపోవడంతో మహారాష్ట్ర కరోనా లాక్​డౌన్​ ఆంక్షలను మరింత కట్టుదిట్టం చేస్తోంది. ఇప్పుడున్న ఆంక్షలను లెవెల్​3కి 
పెంచింది.

టెస్టులు ఎక్కువగా చేయాలెకర్నాటక సీఎస్​కు కేంద్ర ఆరోగ్య శాఖ లెటర్

బెంగళూరు: డెల్టా ప్లస్ వేరియంట్​ను గుర్తించిన జిల్లాల్లో టెస్టులు ఎక్కువగా చేయాలని కర్నాటక ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. జనాల రద్దీ లేకుండా చూడాలని, సాధ్యమైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్లు వేయాలని చెప్పింది. కరోనా కట్టడికి వెంటనే చర్యలు చేపట్టాలంది. దీనికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్  కర్నాటక సీఎస్ రవి కుమార్​కు శనివారం లెటర్ రాశారు. డెల్టా ప్లస్ వేరియంట్ కేసు మైసూరు జిల్లాలో నమోదైనందున అలర్ట్ గా ఉండాలని, ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆ ప్రాంతాన్ని కంటెయిన్​మెంట్ జోన్ గా ప్రకటించి తగిన చర్యలు తీసుకోవాలని, ర్యాండమ్​గా టెస్టులు చేయాలని కోరారు. పాజిటివ్ వచ్చిన వాళ్ల శాంపిళ్లను ల్యాబ్​లకు పంపించాలని పేర్కొన్నారు. ఇప్పటికే డెల్టా వేరియంట్​ను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై కర్నాటక సీఎం యడియూరప్ప.. మంత్రులతో శుక్రవారం చర్చించారు.