అగ్రిచట్టాల అమలు ఏడాదిన్నర వాయిదా!

అగ్రిచట్టాల అమలు ఏడాదిన్నర వాయిదా!
రైతు సంఘాల ముందు కేంద్ర మంత్రుల ప్రతిపాదన రైతుల డిమాండ్లపై చర్చించేందుకు జాయింట్ కమిటీ పదో రౌండ్ చర్చల్లో కేంద్రం ప్రపోజల్.. రేపు మళ్లీ మీటింగ్ న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను ఏడాది నుంచి ఏడాదిన్నర పాటు నిలిపివేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. రైతుల డిమాండ్లపై చర్చించేందుకు రైతు సంఘాలు, ప్రభుత్వ ప్రతినిధులతో జాయింట్ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అప్పటి వరకు ఆ కమిటీ చర్చలు కొనసాగిస్తుందని చెప్పారు. బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో కేంద్రం, రైతు సంఘాల మధ్య పదో రౌండ్ చర్చలు జరిగాయి. చర్చల తర్వాత కేంద్రమంత్రి తోమర్ మీడియాతో మాట్లాడారు. చర్చలు బాగా జరిగాయని, ప్రభుత్వ ప్రపోజల్ కు రైతులు అంగీకరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 22న మళ్లీ మీటింగ్ నిర్వహించాలని నిర్ణయించామని, ఆ రోజుతో సమస్య పరిష్కారమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే కేంద్ర ప్రతిపాదనపై రైతు సంఘాలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ దీన్ని పరిగణనలోకి తీసుకుంటామని, చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నాయి. ‘‘గవర్నమెంట్ ప్రపోజల్ ను మేం వెంటనే తిరస్కరించాం. అయితే గురువారం సమావేశమై, దీనిపై చర్చించాలని నిర్ణయించాం” అని భారతీయ కిసాన్ యూనియన్ (ఉగ్రహన్) ప్రెసిడెంట్ జోగిందర్ సింగ్ ఉగ్రహన్ చెప్పారు.