పొదుపు తగ్గాలి.. ఖర్చు పెరగాలి

పొదుపు తగ్గాలి.. ఖర్చు పెరగాలి

ఈపీఎఫ్‌ఓ కొత్త విధానం

న్యూఢిల్లీ: ప్రజలు మరింత ఖర్చు పెట్టేలా చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలను మొదలుపెట్టింది. ఇందుకోసం కొత్త చట్టాన్ని తేబోతున్నది. మార్కెట్‌‌‌‌కు డిమాండ్‌‌‌‌ పెంచడంలో భాగంగా ఇక నుంచి ఉద్యోగులు ఈపీఎఫ్‌‌‌‌ఓ (ఎంప్లాయిస్‌‌‌‌ ప్రావిడెంట్‌‌‌‌ ఫండ్‌‌‌‌ ఆర్గనైజేషన్‌‌‌‌)కు చెల్లించే మొత్తాన్ని తగ్గించాలని భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఉద్యోగి బేసిక్‌‌‌‌ జీతం నుంచి 12 శాతాన్ని మినహాయించుకుంటున్నారు. ఇక నుంచి ఈ మొత్తాన్ని తగ్గించుకునే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం కోరుకుంటోంది. దీనివల్ల ఉద్యోగుల జీతం మొత్తం పెరుగుతుంది కాబట్టి వారి ఖర్చు పెరుగుతుంది. త్వరలో పార్లమెంటు పరిశీలనకు రాబోతున్న సోషల్‌‌‌‌ సెక్యూరిటీ కోడ్‌‌‌‌ బిల్‌‌‌‌ 2019లోనే ఈ వెసులుబాటు ఉందని కార్మికశాఖ అధికారులు తెలిపారు. ఈ కొత్త బిల్లును ఇదే వారంలో పార్లమెంటులో ప్రవేశపెడతారు. మార్కెట్లోకి మరింత డబ్బు వచ్చేందుకే ఈ ప్రయత్నమని, అయితే యాజమాన్యం నుంచి ఎప్పటిలాగే 12 శాతం పీఎఫ్‌‌‌‌ వసూలు చేస్తామని వివరణ ఇచ్చారు. పార్లమెంటులో బిల్లుకు ఆమోదం వచ్చాకే కొత్త నిర్ణయాన్ని అమలు చేస్తామని తెలిపారు. దీని ప్రకారం ఇక నుంచి ఫిక్స్‌‌‌‌డ్‌‌‌‌ టెర్మ్‌‌‌‌ కాంట్రాక్టు ఉద్యోగులు కూడా గ్రాట్యుటీకి అర్హులు. ప్రస్తుత రూల్స్‌‌‌‌ ప్రకారం ఐదేళ్లు నిండిన వారికి మాత్రమే గ్రాట్యుటీ చెల్లిస్తున్నారు. ఈపీఎఫ్‌‌‌‌ సభ్యులు నేషనల్ పెన్షన్‌‌‌‌ ఫండ్‌‌‌‌కు మారే అవకాశాన్ని కార్మికశాఖ తొలగించింది. ఈపీఎఫ్‌‌‌‌ అత్యధిక వడ్డీరేటు చెల్లిస్తున్నందున, ఎన్‌‌‌‌పీఎస్‌‌‌‌ ఆప్షన్‌‌‌‌ను తొలగించామని తెలిపింది.

సోషల్‌‌ సెక్యూరిటీ ఫండ్‌‌..

ఈపీఎఫ్‌‌ఓ, ఈఎస్‌‌ఐలను కార్పొరేషన్లగా మార్చడానికి ప్రతిపాదనను కార్మికశాఖ తిరస్కరించింది. ఇక నుంచి కూడా స్వతంత్ర సంస్థలుగానే కొనసాగుతాయి. అన్ని కంపెనీలు సీఎస్‌‌ఆర్‌‌ ఫండ్‌‌ నుంచి సోషల్‌‌ సెక్యూరిటీ ఫండ్‌‌ను ఏర్పాటు చేసుకోవాలి. పింఛను, హెల్త్‌‌ ఇన్సూరెన్స్‌‌ వంటి ఖర్చులకు ఇందులోని డబ్బును వాడాలి. తాత్కాలిక కార్మికులకూ ఈ సదుపాయాలను వర్తింపజేయాలి. ఈ విషయమై కార్మికశాఖ సీనియర్‌‌ ఆఫీసర్‌‌ ఒకరు మాట్లాడుతూ ‘‘వ్యాపారాన్ని మరింత సులువుగా చేసుకునేందుకు అనువైన నిర్ణయాలు తీసుకున్నాం. ఇందుకోసం ఎనిమిది కేంద్ర చట్టాలను సోషల్‌‌ సెక్యూరిటీ కోడ్‌‌లో కలిపేశాం. వీటిలో కాంపన్సేషన్‌‌ యాక్ట్‌‌, గ్రాట్యుటీ యాక్ట్ వంటివి ఉన్నాయి’’ అని వివరించారు. సంస్కరణల్లో భాగంగా 44 కార్మిక చట్టాలను.. వేజ్‌‌కోడ్‌‌, ఇండస్ట్రియల్‌‌ రిలేషన్స్‌‌, సోషల్‌‌ సెక్యూరిటీ, హెల్త్‌‌ అండ్‌‌ వర్కింగ్‌‌ కండిక్షన్స్‌‌ కోడ్‌‌గా విభజించారు. వేజెస్‌‌ కోడ్‌‌కు పార్లమెంటు ఈ ఏడాది ఆగస్టులోనే ఆమోదం తెలిపింది. ఇతర కోడ్‌‌లను పార్లమెంటరీ స్టాండింగ్‌‌ కమిటీ పరిశీలనకు పంపారు. ఇండస్ట్రియల్‌‌ రిలేషన్స్ కోడ్‌‌ బిల్లుకు పార్లమెంటు ఆమోదం రావాల్సి ఉంది.

బిల్లులోని ముఖ్యాంశాలు

  • ఈపీఎఫ్‌‌ఓ, ఈఎస్‌‌ఐసీ పరిధిని పెంచుతారు. ఇక నుంచి పది అంతకంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్న కంపెనీలు తప్పనిసరిగా ఆరోగ్య బీమా, పింఛను వంటి సదుపాయాలను కల్పించాలి.
  • పది కంటే తక్కువ ఉద్యోగులు  ఉన్న కంపెనీల యాజమాన్యాలు కూడా కావాలనుకుంటే హెల్త్‌‌ ఇన్సూరెన్స్‌‌ , పింఛను వంటి సదుపాయాలను కల్పించవచ్చు
  • ప్రమాదకరమైన ఫ్యాక్టరీలు, కంపెనీల్లో పనిచేసే కార్మికులకు కల్పించాల్సిన సదుపాయాలపై కేంద్ర ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ ఇస్తుంది.
  • ఉద్యోగులు తమ పీఎఫ్‌‌ కంట్రిబ్యూషన్‌‌ను తగ్గించుకునేందుకు అవకాశం ఇస్తారు. కాంట్రాక్టు కార్మికులకు కూడా కంపెనీలు గ్రాట్యుటీ ఇవ్వాలి.
  • కంపెనీలు సామాజిక భద్రత నిధిని ఏర్పాటు చేసుకోవాలి. కార్పొరేట్‌‌ సోషల్‌‌ రెస్పాన్సిబిలిటీ ఫండ్‌‌ను తప్పనిసరిగా ఖర్చు చేయాలి
  • కంపెనీల రిజిస్ట్రేషన్‌‌ను మరింత సులువుగా మారుస్తారు. సింగిల్‌‌ రిటర్న్‌‌ సదుపాయం కల్పిస్తారు
  • కంపల్సరీ ఇన్సూరెన్స్‌‌పై కంపెనీలకు కొన్ని మినహాయింపులు ఇస్తారు. ఇక నుంచి కూడా ఈపీఎఫ్‌‌ఓ, ఈఎస్‌‌ఐ స్వతంత్ర సంస్థలుగానే కొనసాగుతాయి.