బోనస్​తో రైతుల్లో సంబురం

ఒక్కో రైతుకు యావరేజీగా రూ.31వేల లబ్ది
ఖమ్మం జిల్లాలో బోనస్​ రూపంలోనే రూ.51 కోట్లు చెల్లింపు 
పంట అమ్మిన రెండ్రోజుల్లో అకౌంట్లలో జమ 

ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వ  కొనుగోలు కేంద్రాల్లో సన్నాలు అమ్మిన వారికి ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తుండడం రైతుల కుటుంబాల్లో మరింత సంతోషాన్ని నింపుతోంది. పంటను అమ్ముకున్న తర్వాత 48 నుంచి 72 గంటల్లోపే పంట సొమ్ముతో పాటు బోనస్​ కూడా బ్యాంక్​ అకౌంట్ లో జమ అవుతుండడంతో రైతులను మస్తు ఖుషీ చేస్తోంది. గతంలో పంటను అమ్ముకున్నప్పటికంటే ఖమ్మం జిల్లాలో ఒక్కో రైతుకు అదనంగా రూ.31 వేల వరకు బోనస్ డబ్బులు అకౌంట్లలో జమవుతున్నాయి. 

ఇప్పటి వరకు జిల్లాలో 24,538 మంది రైతుల నుంచి లక్షన్నర మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ.348.33 కోట్లు కాగా, ఇందులో రూ.243 కోట్లు రైతులకు చెల్లించారు. 16,858 మంది రైతుల అకౌంట్లలో 10,32,859 మెట్రిక్​ టన్నులకు సంబంధించి ఇప్పటి వరకు బోనస్ రూపంలోనే రూ.51 కోట్లు జమయ్యాయి.  

4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు టార్గెట్​ 

జిల్లాలో ఈ సీజన్​ లో 2.82 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, ఇందులో 2.62 లక్షల ఎకరాల్లో సన్న రకాలు పండించారు. ఇంకో 20 వేల ఎకరాల్లో దొడ్డు రకం వడ్లు పండించారు. మొత్తం 6.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేయగా, అందులో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా కల్లూరు మండలం రైతులు 4,108 మందికి రూ.13.65 కోట్లు బోనస్ రూపంలో అందాయి. తర్వాత తల్లాడ మండలంలో 2,639 మంది, పెనుబల్లి, వేంసూరు మండలాల్లో రైతులు 2 వేల మందికి పైగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మి లాభపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొన్న వెంటనే అలాట్ చేసిన మిల్లులకు తరలిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో 1,611 మెట్రిక్​ టన్నుల ధాన్యం ట్రాన్స్​ పోర్ట్ చేయాల్సి ఉంది. ఈ ఏడాది 344 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

రూ.లక్ష బోనస్ వచ్చింది

నాకున్న 15 ఎకరాలలో సన్న రకం వడ్లను పండించాను. ఈ ఏడాది వర్షాలు మంచిగా పడటంతో వరి పంట బాగా పండింది. 250 బస్తాలను ధాన్యం కొనుగోలు కేంద్రంలో వేశాను. వేసిన 3 రోజులలోనే నా అకౌంట్ లోకి అసలు నగదుతో పాటు రూ.లక్ష బోనస్ పడ్డాయి. రైతులను ప్రోత్సహం ఇచ్చేలా బోనస్ కూడా ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. 
- నిలపాల నాగరాజు, కల్లూరు గూడెం, పెనుబల్లి మండలం 

బోనస్​ ఇవ్వడం  సంతోషంగా ఉంది

కాంగ్రెస్​ ప్రభుత్వం సన్న వడ్లకు రూ.500 బోనస్​ ఇవ్వడం సంతోషంగా ఉంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో 280 క్వింటాళ్ల సన్నధాన్యం అమ్మాను. బోనస్​రూపంలో అదనంగా రూ. 1,40,200 నాకు బ్యాంక్​ అకౌంట్​లో జమ అయ్యాయి. - ఎడవల్లి ఆదిలక్ష్మి, పాలేరు