న్యూఢిల్లీ: జాతీయ రహదారుల్లో ప్రయాణించే వాహనదారుల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా( ఎన్హెచ్ఎఐ) కొత్త మొబైల్‌యాప్‌ను ప్రవేశపెట్టింది. రాజ్‌మార్గ్ యాత్ర పేరిట ప్రారంభించిన ఈ యాప్‌ద్వారా యూజర్లు హైవేల పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. సమస్యలపై కూడా ఫిర్యాదు చేయొచ్చు. ఈ యాప్ ను గూగుల్ ప్లేస్టోర్, ఐఓఎస్ యాప్‌స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉందని కేంద్ర రోడ్డు ట్రాన్స్ పోర్ట్, హైవేస్ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
నేషనల్ హైవేలో ప్రయాణించే వాహనదారులు ఈ యాప్ ద్వారా రియల్‌టైమ్ వెదర్ కండిషన్స్, సమీప టోల్‌ప్లాజాల వివరాలు, పెట్రోల్ బంకులు, ఆస్పత్రులు, హోటల్స్, ఇతర అత్యవసర సేవల సమాచారం తెలుసుకోవచ్చు. ఫొటో, వీడియోల జియో ట్యాగింగ్ ద్వారా హైవేలకు సంబంధించిన సమస్యలపై యాప్‌లో ఫిర్యాదు చేయొచ్చు. యాప్‌లోని టెక్నాలజీ ద్వారా కంప్లయింట్ఉన్నతాధికారులకు చేరుతుంది. ఈ యాప్ ద్వారా ఫాస్టాగ్ రీచార్జ్, మంత్లీ పాస్‌లు వంటి సేవలను సైతం పొందొచ్చు. వాహనం పరిమిత వేగాన్ని మించి ప్రయాణిస్తుంటే ఈ యాప్ ఓవర్‌స్పీడ్ నోటిఫికేషన్లు కూడా పంపుతుంది.
