ఫార్ములా- ఈ రేసు.. ఓ లొట్టపీస్ కేసు అందులో అవినీతే లేదు.. ఇక కేసెక్కడిది?

  • నన్ను ఏదో ఓ కేసులో ఇరికించాలని చూస్తున్నరు: కేటీఆర్
  • ప్రజలు రెస్ట్ ఇస్తే తీసుకుంటానని కేసీఆర్ ఎప్పుడో చెప్పారు.. ఇప్పుడదే చేస్తున్నరు
  • స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం కుట్ర
  •  ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టులో రూ.12 వేల కోట్ల స్కామ్ జరుగుతున్నదని ఆరోపణ 

హైదరాబాద్, వెలుగు: ఫార్ములా–ఈ రేసు కేసులో అసలు అవినీతే జరగలేదని, అలాంటప్పుడు కేసు ఎక్కడిదని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ ​కేటీఆర్ ​ప్రశ్నించారు. ‘ఫార్ములా – ఈ రేసు కేసు.. ఓ లొట్టపీస్ కేసు’ అని ఆయన కామెంట్​ చేశారు. ‘‘నన్ను ఏదో ఒక కేసులో ఇరికించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే ఆరుసార్లు అలాంటి ప్రయత్నం చేసింది. ఫోన్​ ట్యాపింగ్​అని ఒకసారి, జన్వాడ ఫామ్​హౌస్​లో డ్రగ్స్ ​దొరికాయని మరోసారి, లగచర్ల దాడి ఘటన అని ఇంకోసారి.. ఇప్పుడు తాజాగా ఫార్ములా–ఈ రేసు కేసు పెట్టారు” అని అన్నారు. 

‘‘రేసు నిర్వహించాలని నేనే నిర్ణయం తీసుకున్నాను. సంతకాలూ నేనే చేశాను. కానీ, ఆ వ్యవహారం ప్రాపర్​గా జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులపైనా ఉంటుంది. అదే హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్​లో పేర్కొన్నాను” అని చెప్పారు.‘‘ఆనాడు ఫార్ములా–ఈ రేసు నిర్వహించేందుకు కేబినెట్​లో నిర్ణయం జరగలేదు. అలాగే ఇప్పుడు రేసు రద్దుపైనా రేవంత్​ కేబినెట్​లో నిర్ణయం జరగలేదు. ఒకవేళ నాపై కేసు పెడితే, రేవంత్​పైనా పెట్టాలి” అని  కేటీఆర్​ డిమాండ్ చేశారు. ఏ కేసులోనూ ఏమీ దొరక్కపోవడంతో ఓఆర్ఆర్ ​టెండర్ల విషయంలో తనను ఇరికించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, దమ్ముంటే ముందు ఓఆర్ఆర్ ​లీజును రద్దు చేయాలని సవాల్​విసిరారు. 

‘‘ఏసీబీ ఎఫ్ఐఆర్​ ఆధారంగానే ఈడీ కేసు నమోదు చేసింది. ఈ నెల 7న విచారణకు రావాలని నాకు నోటీసులిచ్చింది. మా లాయర్లను అడిగి విచారణకు హాజరవ్వడంపై నిర్ణయం తీసుకుంటాను” అని చెప్పారు. బుధవారం న్యూ ఇయర్​ సందర్భంగా తెలంగాణ భవన్​లో పార్టీ క్యాలెండర్​ను కేటీఆర్​ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో చిట్​చాట్​చేశారు. కేసీఆర్ ​ప్రజల్లోకి ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారని చెప్పారు. ‘‘ప్రజలు రెస్ట్​ ఇస్తే తీసుకుంటానని ఎన్నికలకు ముందే కేసీఆర్ చెప్పారు. ఇప్పుడదే చేస్తున్నారు. సీఎం రేవంతో లేదంటే ఇంకెవరో రమ్మన్నారని కేసీఆర్​వస్తారా? స్పీకర్ ఫోన్ ​చేసినా కేసీఆర్ ​రాలేదని అంటున్నారు. ఫోన్ ​చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉంది కాబట్టే చేశారు” అని అన్నారు. కేసీఆరే తమకు ట్రంప్ కార్డు అని పేర్కొన్నారు. 

ఒక్కో మంత్రి ఒక్కో అవినీతి దుకాణం.. 

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్​అన్నారు. ఒక్కో మంత్రి ఒక్కో అవినీతి దుకాణం తెరిచారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం భట్టి నుంచి మంత్రి కోమటిరెడ్డి దాకా ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించే పని పెట్టుకున్నారని ఫైర్​అయ్యారు. ‘‘అప్పు చేయకపోవడమే అభివృద్ధి అని చెప్పిన సీఎం రేవంత్.. ఇప్పుడు రూ.1.38 లక్షల కోట్ల అప్పులు చేశారు. అందులో ఆర్ఆర్​ ట్యాక్స్​ రూపంలో ఢిల్లీకి మూటలు వెళ్తున్నాయి. అందుకే అప్పులు చేస్తున్నారు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి పంపుతున్నారు. ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టులో రూ.12 వేల కోట్ల కుంభకోణం జరుగుతున్నది. దీన్ని కేంద్రం నిర్మించాల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై రూ.12 వేల కోట్ల భారం మోపుతున్నది” అని ఆరోపించారు.  

రైతులకు సెల్ఫ్​ డిక్లరేషన్ ఏంటి?

రైతు భరోసా స్కీమ్​లో కోతలు పెట్టేందుకు సర్కార్ ప్రయత్నిస్తున్నదని కేటీఆర్​ ఆరోపించారు. ‘‘పాన్​కార్డు ఉన్నోళ్లకు, ఐటీ కట్టేటోళ్లకు రైతు భరోసా ఇవ్వబోమని చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పంట పొలాల సాగు అంశంలో సెల్ఫ్​ డిక్లరేషన్​ను రైతులపై రుద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. బడా వ్యాపారవేత్తలకు రూ.14.50 లక్షల కోట్ల మేర రుణాలను మాఫీ చేసినప్పుడు.. రైతుల దగ్గరకు వచ్చేసరికి ఈ సెల్ఫ్​డిక్లరేషన్​ఎందుకు?” అని ప్రశ్నించారు. రూ.7,500 కోట్ల బడ్జెట్​లోనే రైతు భరోసాను నామమాత్రంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదని మండిపడ్డారు. ‘‘గ్రాడ్యుయేట్​ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ ఓ 15 మంది వరకు ఇప్పటికే ఆసక్తి చూపిస్తున్నారు. గ్రాడ్యుయేట్, టీచర్​ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు అభ్యర్థులను నిలిపే సంప్రదాయం గతంలో లేదు. ఉద్యమ సమయంలో పార్టీలకు ప్రాతినిధ్యం ఉంటే గట్టిగా పోరాడొచ్చన్న ఉద్దేశంతో మేమే ఆ కొత్త సంప్రదాయాన్ని తెచ్చాం” అని చెప్పారు. 

ప్రభుత్వానికి మైనస్​ మార్కులే.. 

కాంగ్రెస్​ ప్రభుత్వానికి పేదలు కనిపించడం లేదని, పెద్దల కోసమే పనిచేస్తున్నదని కేటీఆర్ ​విమర్శించారు. ఖాజాగూడలో నాలుగెకరాల పేదల భూములను గుంజుకునేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. పేదల ఇండ్లను కూల్చేశారని, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? అని ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్​ ఏడాది పాలనకు మైనస్​ మార్కులే వేస్తాం. ఇది ప్రభుత్వం కాదు.. ఓ పరిహాసంలా మార్చేశారు. పాలన పేరుతో ప్రజలను హింసిస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రజలు తిట్టుకుంటున్నారు. అన్ని తిట్లు తిని ఉంటే మరో సీఎం అయితే సూసైడ్​ చేసుకుని ఉండేవారు” అని అన్నారు. ‘‘కాంగ్రెస్​ వైఫల్యాలను ఎండగడుతూనే మా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఏప్రిల్​27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం, భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. అక్టోబర్​లో పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుంది. మరోసారి కేసీఆర్​నే అధ్యక్షుడిగా ఎన్నుకుంటాం. 60 లక్షల మంది బీఆర్ఎస్​ కార్యకర్తల అభీష్టం మేరకు కేసీఆర్​ను అధ్యక్షుడిగా నామినేట్​ చేస్తూ నేనే సంతకం పెడతాను” అని చెప్పారు.

బీసీలకు రిజర్వేషన్లు  ఎగ్గొట్టే కుట్ర.. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని కేటీఆర్​అన్నారు. అందుకే ప్రణాళికాబద్ధంగా ఓ కుట్రకు తెరలేపిందని విమర్శించారు. ‘‘ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక సంస్థల చట్టసవరణ బిల్లులో బీసీలకు రిజర్వేషన్లను పెంచే అంశంపై సుప్రీంకోర్టు కేసును ప్రస్తావించడంతో పాటు ట్రిపుల్ టెస్ట్​, ప్రత్యేక బీసీ కమిషన్ సిఫార్సుల నివేదిక వంటి కారణాలనూ చూపించింది. వీటిని అడ్డంపెట్టుకుని ఎవరితోనో ఒకరితో కోర్టులో కేసు వేయించేందుకు సర్కార్ ప్రయత్నం చేస్తున్నది. తద్వారా ఉన్న రిజర్వేషన్లతోనే ఎన్నికలను పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్నది” అని ఆరోపించారు.