- కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు
- మహారాష్ట్రలోని వధావన్ వద్ద డీప్ డ్రాఫ్ట్ గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్
- తమిళనాడు, గుజరాత్ తీరాల్లో విండ్ ఎనర్జీ ప్రాజెక్టులు
- వారణాసి లాల్‌బహదూర్ శాస్త్రి ఎయిర్పోర్ట్ విస్తరణ
- మద్దతు ధర పెంపుతో కేంద్రంపై రూ.2 లక్షల కోట్ల భారం
- కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి
న్యూఢిల్లీ: కేంద్ర సర్కారు వరికి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను పెంచింది. రూ. 117 అదనంగా పెంచడంతో క్వింటాల్ ధాన్యం ధర రూ. 2,300కు చేరింది. వచ్చే ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి వరితోపాటు జొన్న, పత్తి సహా 14 రకాల పంటలకు ఎంఎస్పీని హైక్ చేసింది. కేంద్ర కేబినెట్ బుధవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిని కేంద్ర రైల్వే, సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. వివిధ పంటలకు మద్దతు ధర పెంపుతో కేంద్రంపై రూ. 2 లక్షల కోట్ల భారం పడుతున్నదని తెలిపారు. ప్రధాని మోదీ ఎల్లప్పుడూ రైతులకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. మూడోసారి అధికారం చేపట్టాక అన్నదాతల కోసమే మొదటి నిర్ణయం తీసుకున్నారని, తొలి కేబినెట్మీటింగ్లోనూ రైతుల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. ఉత్పత్తి వ్యయం కంటే ఎంఎస్పీ కనీసం 1.5 రెట్లు ఉండాలని 2018 కేంద్ర బడ్జెట్లో నిర్ణయం తీసుకున్నామని, దీనికి అనుగుణంగానే ఇప్పుడు కనీస మద్దతు ధర పెంచామని చెప్పారు.
వరికి మద్దతు ధర 5.35 శాతం పెంపు
ఈ సీజన్లో వరికి ఎంస్పీని 5.35 శాతం పెంచారు. అంటే అదనంగా రూ.117 పెంచగా.. క్వింటాల్‌కు రూ. 2,300 చెల్లించనున్నారు. 2013–14 మద్దతు ధరతో పోల్చితే ఇది రూ. 1,310 ఎక్కువ. మధ్య రకం పత్తికి రూ.7,121, లాంగ్ స్టెపెల్ రకానికి రూ.7,521 పెంచారు.
గత ఎంఎస్పీతో పోలిస్తే ఇది రూ. 510 ఎక్కువ. ప్రధాని మోదీ మిల్లెట్స్‌కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో వాటి ఎంఎస్పీని హైక్ చేశారు. జొన్న (హైబ్రిడ్) రూ.3,371, జొన్న (మాల్దండి) 3,421, సజ్జలు రూ.2,625, రాగులు 4,290, మక్కజొన్న మద్దతు ధరను రూ.2,225 కు పెంచారు. ఇక పప్పుధాన్యాల విషయానికి వస్తే పెసర్లు రూ.8,682, కంది రూ.7,550, మినుములకు మద్దతు ధరను రూ.7,400 చొప్పున చెల్లించాలని నిర్ణయించారు. నూనెగింజలకు సంబంధించి వేరుశెనగ రూ. 6,783, పొద్దుతిరుగుడు విత్తనాలు రూ.7280, నువ్వులు రూ.9,267, సోయాబీన్ (పసుపు) కు ఎంఎస్పీ 4,892 గా ఖరారు చేశారు. మద్దతు ధర పెంపుతో గతేడాదితో పోలిస్తే రైతులకు ₹ 35,000 కోట్ల లాభం చేకూరనున్నట్టు అంచనా వేశారు.
కేబినెట్లో తీసుకున్న ఇతర నిర్ణయాలు
మహారాష్ట్రలోని దహను సమీపంలోని వధావన్ వద్ద గ్రీన్‌ఫీల్డ్ డీప్ డ్రాఫ్ట్ పోర్టును ఏర్పాటు చేసేందుకు కేబినెట్ఆమోదం తెలిపింది. దీన్ని రూ.76,200 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ, మహారాష్ట్ర మారిటైమ్ బోర్డ్ 74% , 6% వాటాతో వధావన్ పోర్ట్ ప్రాజెక్ట్ లిమిటెడ్ ద్వారా ఈ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. 23 మిలియన్ కంటైనర్ల (298 మిలియన్ టన్నులు) సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే ప్రపంచంలోనే టాప్ 10 పోర్టుల్లో ఒకటిగా నిలవనుందని,12 లక్షల మందికి ఉపాధి లభించినున్నదని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. అలాగే, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో మొత్తం రూ.7,453 కోట్లు వెచ్చించి, చెరో 500 మెగావాట్ల సామర్థ్యంతో విండ్ ఎనర్జీ ప్రాజెక్టుల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటితోపాటు వారణాసిలోని లాల్‌బహదూర్‌శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను డెవలప్ చేసేందుకు నిర్ణయించారు. రూ.2,869.65 కోట్లతో కొత్త టెర్మినల్ భవనం నిర్మాణంతో పాటు రన్‌వేల విస్తరణ, ఇతర అభివృద్ధి పనులు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రన్ వే ను 4075 X 45 మీటర్ల మేర విస్తరించడంతో పాటు అదనపు యాప్రాన్ నిర్మాణం (20 విమానాల పార్కింగ్ సామర్థ్యంతో) చేపట్టనున్నారు.
