న్యూఢిల్లీ: విమాన టికెట్ రేట్లపై విధించిన పరిమితులు తొలగించడంతో ఏవియేషన్ సెక్టార్ ఇక నుంచి దూసుకుపోతుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ అన్నారు. ఫెస్టివ్ సీజన్ వస్తుండడంతో ఎయిర్ ట్రావెల్‌కు డిమాండ్ పెరుగుతుందని అంచనావేశారు. తాజాగా కొన్ని విమానాల్లో సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే. కొన్ని డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి నెలకొన్న సంఘటనలను చూసి భయపడాల్సిన పనిలేదని ఆయన అన్నారు. ప్రయాణికుల సేఫ్టీపై రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పారు.
ప్రభుత్వం ఈ నెల చివరి నుంచి విమానం టికెట్ రేట్లపై విధించిన పరిమితులను ఎత్తేస్తోంది. దీంతో కంపెనీలు తక్కువ రేట్లకు టికెట్‌లను ఆఫర్ చేసి, ఎక్కువ మంది ప్రయాణికులను ఆకర్షించడానికి వీలుంటుందని అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. కొత్తగా కరోనా కేసులు పెరగవనే అంచనాల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నామని అన్నారు.
జెట్ ఫ్యూయల్ రేట్లు పెరగడంతో పాటు కరోనా సంక్షోభం వలన ఎయిర్ ట్రావెల్స్ చేసే వారు తగ్గిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం డైలీ ప్యాసెంజర్ల నెంబర్ సగటున 3,35,000 గా ఉంది. ఈ నెంబర్ రానున్న కాలంలో 4 లక్షలకు పెరుగుతుందని అంచనా. ఈ ఏడాది జూన్ మొత్తంలో 1.05 కోట్ల మంది ప్యాసెంజర్లు ఎయిర్ ట్రావెల్ చేయగా, మే లో ఈ నెంబర్ 1.2 కోట్లుగా రికార్డయ్యింది.
