జీఎస్టీ ఎగవేతదారులపై దాడులు, 187 మంది అరెస్టు

జీఎస్టీ ఎగవేతదారులపై దాడులు, 187 మంది అరెస్టు
న్యూఢిల్లీ: డేటా ఎనలిటిక్స్, ఇతర ఏజన్సీల నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ తో జీఎస్టీ ఎగవేతదారులపై ప్రభుత్వం దాడులను ముమ్మరం చేసిందని, దీంతో గత నెలన్నరలోనే 7 వేల మందిపై యాక్షన్ తీసుకోవడంతోపాటు 185 మందిని అరెస్టు చేశామని ఫైనాన్స్ సెక్రటరీ అజయ్ భూషణ్ పాండే ఆదివారం వెల్లడించారు. ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకుంటుండడంతో జీఎస్టీ రెవెన్యూ  డిసెంబర్లో రూ. 1.15 లక్షల కోట్లకు మెరుగుపడిందని తెలిపారు. ఫేక్ ఇన్వాయిస్ ల రాకెట్ కనిపెట్టడంతో గత నెలరోజుల్లోనే 187 మందిని అరెస్టు చేశారని చెప్పారు. అరెస్టయిన వారిలో అయిదుగురు చార్టర్డ్ అకౌంటెంట్లు, ఒక కంపెనీ సెక్రటరీ కూడా ఉన్నారని పేర్కొన్నారు. కొంత మంది మేనేజింగ్ డైరెక్టర్లు 40 నుంచి 50 రోజులు జైలులో కూడా ఉన్నట్లు తెలిపారు. కొన్ని పెద్ద కంపెనీలు కూడా ఫేక్ ఇన్వాయిసింగ్ కు పాల్పడుతున్నట్లు తేలిందన్నారు. ఇన్కంటాక్స్ డిపార్ట్మెంట్, కస్టమ్స్ యూనిట్, బ్యాంకులు, జీఎస్టీ డిపార్ట్మెంట్ల ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ ను విశ్లేషించి, జీఎస్టీ ఎగవేతదారులను పట్టుకుంటున్నట్లు పాండే వెల్లడించారు. జీఎస్టీ ఫేక్ ఇన్వాయిస్ కేసులపై ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కూడా వెంటనే చర్యలు తీసుకుంటోందని అన్నారు. డేటా అందుబాటులో ఉండటంతో ఏదో ఒక రోజున ఎగవేతదారులు దొరికిపోక తప్పదని పేర్కొన్నారు.