ఓటీటీ, సోషల్ మీడియా నియంత్రణకు కేంద్రం కొత్త గైడ్ లైన్స్

ఓటీటీ, సోషల్ మీడియా నియంత్రణకు కేంద్రం కొత్త గైడ్ లైన్స్

భారత్‌లో సోషల్‌ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ కట్టడికి కేంద్రం సిద్ధమైంది. ఓటీటీ, డిజిటల్ ఫ్లాట్‌ఫాంలపై విడుదలయ్యే సినిమాలతో పాటు, సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అయ్యే  ఫేక్ న్యూస్ కట్డడి పై ఉక్కుపాదం మోపే విధంగా కొత్త గైడ్‌లైన్స్ విడుదల చేసింది.. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్ మీడియాకు తెలిపారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేయకుండా కొత్త నిబంధనలు ఉండాలని, అభ్యకర పోస్టులను తక్షణం గుర్తించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

అశాంతిని, అవాస్తవాలను కొన్నిసార్లు సోషల్ మీడియా ప్రచారం చేస్తోందని , ఇతరుల గౌరవాన్ని దెబ్బతీసే సోషల్ మీడియా రాతలకు అడ్డుకట్ట వేస్తామని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. అసత్య, దుష్ప్రచారాలను అడ్డుకునేలా నియంత్రణ తెస్తామని, దీనిలో భాగంగా మూడు నిబంధనలను అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.

దీని ప్రకారం .. సోష‌ల్ మీడియా సంస్థ‌లు ఖ‌చ్చితంగా త‌మ అధికారుల‌ను భార‌త్ లో నియ‌మించాలి, భార‌త్ లో వారి కార్యాల‌యాల‌ను ఏర్పాటు చేయాలి. ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించే అధికారం కూడా దేశంలోనే ఉండాలి. ఫిర్యాదులను నిర్ణీత కాలంలో పరిష్కరించాలి. సోషల్ మీడియా సైట్లు పోస్టులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. అసభ్య, అసత్య పోస్టులు ఎవరు పెడుతున్నారో గుర్తించే బాధ్యత ఆయా సంస్థలదే. ఫిర్యాదులను పరిష్కరించే అధికారులు 24 గంటలూ దర్యాప్తు సంస్థలకు అందుబాటులో ఉండాలి.

అదేవిధంగా ఓటీటీ లో ప్ర‌సార‌మ‌య్యే కంటెంట్ పై కూడా కేంద్రం మూడు అంచెల నియంత్రణ విధానాన్ని తెలిపింది. ఓటీటీ లో ఐదు అంశాలను బ్లాక్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

• అసభ్య, అశ్లీల, హింసాత్మక కంటెంట్ పై నిషేధం.

• వయస్సు ఆధారంగా 5 విభాగాలుగా ఓటీటీ విభజన.

• సామాజిక ఉద్రిక్తతలు పెంచే కంటెంట్ పై నిషేధం.

• సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే అంశాల పై నిషేధం.

• మహిళలు, చిన్నారులు, దళితులను అవమానించే కంటెంట్స్ పై నిషేధాజ్ఞలు విధించింది. అదే విధంగా జాతీయ సమగ్రత, సమైక్యతను దెబ్బతీసే కంటెంట్ పై కూడా నిషేదాన్ని కొనసాగించ‌నున్న‌ట్లు తెలిపింది.