రక్షణ, హోం శాఖల్లో అగ్నివీర్‌‌‌‌లకు 10%  రిజర్వేషన్

రక్షణ, హోం శాఖల్లో అగ్నివీర్‌‌‌‌లకు 10%  రిజర్వేషన్
  • దేశవ్యాప్తంగా నిరసనల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం
  • డిఫెన్స్‌‌లో కోస్ట్ గార్డ్, 16 పబ్లిక్ సెక్టార్ విభాగాలకు వర్తింపు
  • హోంశాఖలో సీఏపీఎఫ్, అస్సాం రైఫిల్స్‌‌కు..
  • వయో పరిమితిని మరో మూడేళ్లు పెంచిన హోం శాఖ

న్యూఢిల్లీ: సాయుధ దళాల్లో రిక్రూట్‌‌మెంట్ కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్‌‌ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ స్కీమ్‌‌లో పలు మార్పులు చేసింది. అగ్నివీర్‌‌‌‌లుగా నాలుగేండ్లు పని చేసిన వాళ్లకు రక్షణ శాఖ, హోం శాఖల్లో 10% రిజర్వేషన్ కల్పించనుంది. ‘‘ఇండియన్ కోస్ట్ గార్డ్, డిఫెన్స్ సివిలియన్ పోస్టులు, 16 డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ సంస్థల్లో అగ్నివీర్‌‌‌‌లకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తం. ఇప్పటికే ఎక్స్‌‌ సర్వీస్‌‌మెన్‌‌కు ఉన్న రిజర్వేషన్‌‌కు ఇది అదనం. దీనికి రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్ శనివారం ఆమోదం తెలిపారు” అని రక్షణ శాఖ వెల్లడించింది. ‘‘సంబంధిత రిక్రూట్‌‌మెంట్ రూల్స్‌‌కు అవసరమైన సవరణలు చేస్తాం. డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ సంస్థలు కూడా రిక్రూట్‌‌మెంట్ రూల్స్‌‌కు సవరణలు చేయాలని సూచిస్తాం. అవసరమైన వయోపరిమితి సడలింపు నిబంధన కూడా సవరిస్తారు’’ అని ట్వీట్ చేసింది. 

మరోవైపు సెంట్రల్ ఆర్మ్‌‌డ్‌‌ పారామిలిటరీ ఫోర్సెస్ (సీఏపీఎఫ్‌‌), అస్సాం రైఫిల్స్‌‌లో చేపట్టే రిక్రూట్‌‌మెంట్లలో అగ్నివీర్‌‌‌‌లకు 10 శాతం రిజర్వేషన్‌‌ కల్పిస్తామని కేంద్ర హోం శాఖ కూడా ప్రకటించింది. ఏజ్ లిమిట్ పెంపుపైనా కీలక నిర్ణయం తీసుకుంది. సీఏపీఎఫ్‌‌, అస్సాం రైఫిల్స్‌‌లో అగ్నివీర్‌‌‌‌లకు పేర్కొన్న ఏజ్ లిమిట్‌‌ కంటే.. మూడేండ్ల సడలింపు ఇచ్చింది. ఆ ప్రకారం బీఎస్‌‌ఎఫ్, సీఆర్‌‌‌‌పీఎఫ్, సీఐఎస్‌‌ఎఫ్, ఐటీబీపీ, ఎస్‌‌ఎస్‌‌బీ, ఎన్‌‌ఎస్‌‌జీ, ఎస్‌‌పీజీలో చేరేందుకు అగ్నివీర్‌‌‌‌లకు వయో పరిమితిని 26 ఏండ్లకు పెంచింది. 18 ఏండ్ల నుంచి 21 ఏండ్ల మధ్య వయసు ఉన్న వాళ్లు అగ్నిపథ్‌‌ స్కీమ్‌‌ కింద అగ్నివీర్‌‌‌‌లుగా చేరేందుకు అర్హులు. అయితే తొలి బ్యాచ్‌‌కు రెండేండ్ల సడలింపు ఇస్తున్నట్లు హోంశాఖ ప్రకటించింది. తాజాగా మరో మూడేళ్లు సడలింపు ఇస్తున్నట్లు వెల్లడించింది. అంటే అగ్నిపథ్‌‌ కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లకు మొత్తంగా ఐదేండ్ల సడలింపు ఇచ్చారు.

పోలీస్ క్లియరెన్స్ రాదు: ఎయిర్‌‌‌‌చీఫ్
అగ్నిపథ్ నిరసనల్లో పాల్గొంటున్న ఆర్మీ అభ్యర్థులకు పోలీస్ క్లియరెన్స్ రాదని ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి హెచ్చరించారు. ఆందోళనల్లో పాల్గొనే వాళ్లు భవిష్యత్‌‌లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ‘‘హింసను మేం ఖండిస్తున్నాం. ఇది పరిష్కారం కాదు. రిక్రూట్‌‌మెంట్‌‌లో చివరి దశ పోలీస్ వెరిఫికేషన్. ఈ నిరసనల్లో ఎవరైనా ఉంటే.. పోలీసుల నుంచి క్లియరెన్స్ పొందలేరు” అని చౌధరి వెల్లడించారు. అగ్నిపథ్ పథకం సానుకూల ముందడుగని, ఈ స్కీమ్‌‌పై అనుమానాలు ఉన్న వాళ్లు స్థానిక మిలిటరీ స్టేషన్లు, ఎయిర్‌‌‌‌ఫోర్స్ లేదా నేవీ బేస్‌‌లను సంప్రదించవచ్చని, అక్కడ వారి సందేహాలకు క్లారిటీ దొరుకుతుందని తెలిపారు.

త్రివిధ దళాల పెద్దాఫీసర్లతో రాజ్‌‌నాథ్ భేటీ
అగ్నిపథ్‌‌ ఆందోళనలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆర్మీ, నేవీ, ఎయిర్‌‌‌‌ఫోర్స్‌‌కు చెందిన ఉన్నతాధికారులతో రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్ భేటీ అయ్యారు. ఈ మీటింగ్‌‌కు చీఫ్‌‌ ఆఫ్‌‌ ఎయిర్‌‌‌‌స్టాఫ్ వీఆర్ చౌధరి, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్‌‌‌‌.హరికుమార్, ఆర్మీ వైస్‌‌ చీఫ్ బీఎస్ రాజు హాజరయ్యారు. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ప్రస్తుతం హైదరాబాద్‌‌లో ఉండటంతో ఆయన మీటింగ్‌‌కు రాలేదు. ఆందోళనకారులను శాంతింపజేసేందుకు ఉన్న దారులపై సమావేశంలో చర్చించారు.