గవర్నర్ పంపిన లెటర్​లో ఏముంది?

  • ఫార్ములా ఈ–రేస్​ కేసులో రాజ్​భవన్​ నుంచి సర్కారుకు ఫైల్​
  • కేటీఆర్ ​ప్రాసిక్యూషన్​పై కొనసాగుతున్న సస్పెన్స్​
  • త్వరలోనే ఏసీబీ రంగంలోకి దిగుతుందని జోరుగా చర్చ

హైదరాబాద్, వెలుగు: ఫార్ములా ఈ–రేస్​ కేసులో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్​ను ప్రాసిక్యూట్​ చేసేందుకు గవర్నర్​ అనుమతి కోరుతూ అక్టోబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిన విషయం తెలిసిందే. దానికి బదులిస్తూ గవర్నర్​ జిష్టుదేవ్​ వర్మ ప్రభుత్వానికి ఈ నెల 10న ఫైల్ ​పంపినట్టు తెలిసింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు సైతం ధ్రువీకరించారు. అయితే, కేటీఆర్​ ప్రాసిక్యూషన్​కు అనుమతి ఇచ్చారా? లేదా? అనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్స్​లో పెట్టింది.

పైగా ఈ కేసును చూస్తున్న ఏసీబీకి ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం వెళ్లలేదు. దీంతో గవర్నర్​లెటర్​ ఇచ్చి నాలుగు రోజులవుతున్నా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో అసలు ఏం జరుగుతోంది? అని సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. గత మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి, సీఎం రేవంత్​ రెడ్డి దాదాపు మూడు గంటలు భేటీ అయి వివిధ అంశాలపై  చర్చించారు. అప్పటికే రాజ్​భవన్​ నుంచి వచ్చిన ఈ ఫార్ములా రేసు  ఫైల్​పైనా ఇరువురు చర్చించినట్టు తెలిసింది.

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న టైంలో గవర్నర్​ నుంచి ఏ నిర్ణయం వచ్చిందనే విషయం బయటకు వస్తే అన్నీ పక్కదారి పట్టే అవకాశం ఉంటుందని ప్రభుత్వం వెయిట్​చేస్తున్నట్లు సమాచారం. ఫార్మూలా ఈ–రేస్​ కేసులో కేటీఆర్​ ప్రాసిక్యూషన్​కు గవర్నర్​ అనుమతి లభించి ఉంటుందని సెక్రటేరియెట్​వర్గాలు పేర్కొంటున్నాయి. బరాబర్​ రూ.55 కోట్లు తానే ఇచ్చానని, అవి ఫారెన్​ కంపెనీకే వెళ్లినట్టు ప్రకటించిన కేటీఆర్​ఈ అంశంలో సెల్ఫ్​ గోల్​ చేసుకున్నారని అంటున్నారు.

ఆయనే ఒప్పుకున్నాక.. గవర్నర్​ నుంచి పర్మిషన్​ రాకపోతే అది మరింత పొలిటికల్​ రంగు పులుముకుంటుందని.. దీంతో ప్రాసిక్యూషన్​కు అనుమతి వచ్చే ఉంటుందని భావిస్తున్నారు. పర్మిషన్​ వచ్చినట్లయితే అసెంబ్లీ సమావేశాల తర్వాతే ఆ లెటర్​ను ఏసీబీకి పంపుతుందని, ఆ తర్వాతే కేటీఆర్​ను ప్రాసిక్యూట్​ చేసి అదుపులోకి తీసుకోనున్నట్టు తెలుస్తోంది. 

ఫార్మూలా ఈ- రేస్​లో ఏం జరిగిందంటే..

బీఆర్ఎస్​ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ–రేస్​ కోసం ఓ విదేశీ కంపెనీకి కేటీఆర్ ఆదేశాల మేరకు అప్పటి ఎంఏయూడీ ప్రిన్సిపల్​సెక్రటరీగా ఉన్న అర్వింద్​కుమార్​ ఎలాంటి అనుమతులు లేకుండా రూ.55 కోట్లు చెల్లించారు. ఈ చెల్లింపులకు అప్పటి హెచ్‌‌ఎండీఏ పాలకమండలి అమోదం కూడా లే దని, అంతేకాక ఈ నిధులను రిజర్వ్‌‌ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ ఇండియా అనుమతి లేకుండా విదేశీ మారకం రూపంలో చెల్లించినట్టు గవర్నర్‌‌కు రాసిన లేఖలో ప్రభుత్వం పేర్కొంది. కాగా మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్‌‌ చెల్లింపులకు అనుమతినిచ్చినందున ఇప్పుడు ఆయన విచారణకు గవర్నర్‌‌ అనుమతి తప్పనిసరైంది.

కేటీఆర్‌‌ ఆదేశాల మేరకు అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్‌‌ఎండీఏ కమిషనర్‌‌ కూడా అయిన అర్వింద్‌‌కుమార్‌‌ చెల్లింపులు చేశారు. ఈ కేసులో కేటీఆర్ ను విచారించేందుకు పీసీ యాక్ట్ 17ఏ కింద అనుమతించాలంటూ అక్టోబర్ లో​రాష్ట్ర  ప్రభుత్వం గవర్నర్​కు  లేఖ రాసింది. ఈ విషయం బయటకు వచ్చిన తరువాత కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం, మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్​కు ఓటు వేయొద్దంటూ చెప్పడం వంటివన్నీ గవర్నర్​ పర్మిషన్​ నుంచి తప్పించుకుని.. బీజేపీతో ములఖాత్​ చేసుకునేందుకేనని కాంగ్రెస్​ నేతలు ఆరోపించారు.