పీవీ నరసింహరావు బహుముఖ ప్రజ్ఞాశాలి: రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

బషీర్ బాగ్, వెలుగు: మాజీ ప్రధాని పీవీ నరసింహరావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అహర్నిశలు కృషి చేశారని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. రవీంద్రభారతిలో మంగళవారం సాయంత్రం పీవీ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పీవీ నరసింహరావు మెమోరియల్ అవార్డు ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ,  అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మాజీ ఎంపీలు సుబ్బరామిరెడ్డి, కేవీపీ రామచంద్రరావు, పీవీ సోదరుడు పీవీ మనోహర్ రావు హాజరయ్యారు. కాళోజీ శిష్యుడు, ప్రముఖ కవి భాస్కర్, సావిత్రి దంపతులకు గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ పీవీ అవార్డు అందజేశారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. పీవీ, కాళోజీలది గురు శిష్యుల బంధమన్నారు. పీవీ16 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరనీ, ఆయన అమలు చేసిన భూ సంస్కరణలు రాజకీయ మౌలిక స్వభావాన్ని మార్చేశాయన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ.. పీవీ విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చారన్నారు. సీనియర్ జర్నలిస్టులు విజయబాబు, సీఎస్బీ డైరెక్టర్ బాలలత, పీవీ ఫౌండేషన్ జనరల్ సెక్రెటరీ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.