13,205 ఇండ్లు పెరిగినయ్​ యాదాద్రి జిల్లాలో ముగిసిన సర్వే

  • స్పీడ్​గా డాటా ఎంట్రీ 
  • స్టేట్​లోనే రెండో స్థానం
  • ఇప్పటికే 94 శాతం కంప్లీట్​

యాదాద్రి, వెలుగు : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా యాదాద్రి జిల్లాలో కుటుంబాల లెక్క తేలిపోయింది. మొదట గుర్తించిన కుటుంబాల కంటే 13 వేలకు పైగా పెరిగాయి. 2011 జనగణన ప్రకారం యాదాద్రి జిల్లాలో 1.87 లక్షల కుటుంబాలు ఉన్నాయి. 13 ఏండ్లుగా పెరిగిన జనాభాను దృష్టిలో పెట్టుకొని 2,47,354 కుటుంబాలకు చేరుకుందని ఆఫీసర్లు లెక్కలు వేశారు. ఆ స్థాయిలోనే ఇండ్లకు స్టిక్కర్లు వేశారు. 

అయితే సర్వే కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన కుటుంబాలు సైతం రావడంతో ఆ సంఖ్య పెరిగింది. సర్వే ప్రారంభం నాటికి 2,58,667 కుటుంబాలు ఉన్నాయి. సర్వే ముగిసేనాటికి యాదాద్రి జిల్లాలో 2,60,559 ఇండ్లు ఉన్నట్టు తేలడంతో ఆఫీసర్లు వేసిన అంచనా కంటే 13,205 కుటుంబాలు పెరిగాయి.  

యాదాద్రిలో ముగిసిన సర్వే..

యాదాద్రి జిల్లాలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ముగిసిపోయింది. 99.70 శాతం సర్వే ముగిసింది. మిగిలిన కుటుంబాలు సర్వేలో ఎందుకు పాల్గొనలేదో రిపోర్ట్ చేశారు. కొన్ని ఇండ్లు డోర్​లాక్​ వేసి ఉండడం లేదా ఇతర ప్రాంతాల్లో నిర్వహించిన సర్వేలో పాల్గొన్నారని రిపోర్టుల్లో పేర్కొనారు.

Also Read :- డిసెంబర్ 6న బీజేపీ బహిరంగ సభ

 జిల్లాలోని రామన్నపేట, అడ్డగూడూరు మినహా మిగిలిన మండలాల్లో సర్వే వంద శాతం, అంతకంటే ఎక్కువగానే జరిగింది. రూరల్​ కంటే అర్బన్​లో ఎక్కువగా సర్వే నమోదు జరిగిందని ఆఫీసర్లు చెబుతున్నారు. రూరల్​లో నివాసం ఉన్న కుటుంబాలే.. అర్బన్​కు వలస వెళ్లడం వల్ల సర్వే ఎక్కువగా జరిగిందని తెలిపారు. 

డాటా ఎంట్రీలో రెండో స్థానం..

సర్వే ముగియడంతోనే డాటాను కంప్యూటరీకరణ స్పీడ్​గా సాగుతోంది. కంప్యూటర్లు ఎక్కువగా ఉపయోగించడంతోపాటు ఎన్యుమరేటర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు సంయుక్తంగా నిర్వహించడంతో కంప్యూటరీకరణ స్పీడ్ గా సాగుతోంది. సర్వే చేసిన కుంటుంబాల డాటా ఎంట్రీలో ములుగు జిల్లా మొదటి స్థానంలో ఉండగా యాదాద్రి జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 94 శాతం డాటాను ఎంట్రీ చేశారు. ఎంట్రీ చేసిన డాటా, ఎంట్రీ చేయని సర్వే ఫారాలను లెక్కించి.. అంతా సవ్యంగా సాగుతుందని ఆఫీసర్లు గుర్తించారు.

ఒకే చోటనే ఎంట్రీ..

కొన్ని కుటుంబాలు యాదాద్రి జిల్లాతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ సర్వేలో పాల్గొన్నట్టు తెలిసింది. అయితే సర్వేలో రెండు చోట్ల పాల్గొన్నా.. డాటా ఎంట్రీ మాత్రం ఒక్క చోటులోనే అవుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు. 

స్పీడ్​గా డాటా ఎంట్రీ.. 

సర్వేకు సంబంధించిన డాటా ఎంట్రీ స్పీడ్​గా సాగుతోంది. ఎన్యుమరేటర్లు, ఆపరేటర్లు ఉమ్మడిగా చేస్తున్నారు. తొందరలోనే ఎంట్రీ ముగిసిపోతుంది. కొన్ని కుటుంబాలు సర్వేలో పాల్గొనలేదు. ఆ కుటుంబాలు ఎందుకు పాల్గొనలేదో రిపోర్ట్ రెడీ చేస్తున్నాం. - గంగాధర్, అడిషనల్ కలెక్టర్, యాదాద్రి