కడుపు 'కోత'లపై సర్కారు ఫోకస్

  • ప్రైవేట్​లో 90 శాతం సిజేరియన్ డెలివరీలు
  • ఆరోగ్యం, ఆర్థిక పరంగా నష్టపోతున్న పేదలు
  • సిజేరియన్లు తగ్గించేందుకు ప్రభుత్వం కసరత్తులు
  • గర్భిణులు, కుటుంబ సభ్యులకు అవేర్నెస్ కల్పించనున్న ఆఫీసర్లు

హనుమకొండ, వెలుగు: ప్రసూతి సేవలందించే ప్రైవేటు ఆస్పత్రులు అవసరమున్నా లేకున్నా సిజేరియన్ కాన్పులే చేస్తున్నాయి. పుట్టిన బిడ్డకు ఏదోక సమస్య ఉందని భయపెట్టి, కమీషన్ వచ్చే ప్రైవేటు ఆస్పత్రులకు పంపిస్తున్నాయి. దీంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికంగా, ఆరోగ్య పరంగా నష్ట పోతున్నాయి. ఈ నేపథ్యంలోనే సర్కారు ఆస్పత్రుల్లో డెలివరీలు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కానీ, గవర్నమెంట్ మెటర్నటీ ఆస్పత్రిలో శానిటేషన్, స్టాఫ్ సమస్యలు వేధిస్తుండటంతో సౌకర్యాలు కల్పించి ఎక్కువశాతం కాన్పులు సర్కారులోనే జరిగేలా ప్లాన్ చేస్తోంది. ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు చేపడుతోంది. 

నూటికి 90 శాతం కోతలే..

ప్రైవేటు ఆస్పత్రుల్లో డెలివరీ కోసం అడ్మిట్ అయితే చాలు, అక్కడి డాక్టర్లు కోతలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. పేషెంట్లకు అందిస్తున్న సేవలు వివరించి రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు ప్యాకేజీలు మాట్లాడుకుంటున్నారు. నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలున్నా సిజేరియన్ కాన్పులు చేస్తున్నారు. ఇలా ప్రైవేటు ఆస్పత్రుల్లో అడ్మిట్ అయిన గర్భిణుల్లో నూటికి 90 శాతం సిజేరియన్ డెలివరీలే చేసేస్తున్నారు. నాలుగేండ్లలో హనుమకొండ జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో మొత్తంగా 19,006 డెలివరీలు జరిగితే, 16,362 సిజేరియన్ కాన్పులే కావడం గమనార్హం. 

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ప్రైవేటులో 1,569  ప్రసవాలు జరిగితే, 1,377 సిజేరియన్ డెలివరీలే చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇదే కాకుండా డెలివరీ తర్వాత పుట్టిన బిడ్డకు ఏదో ఒక సమస్య ఉందని పేషెంట్లను భయపెట్టి, తమకు కమీషన్లు వచ్చే ఆస్పత్రులకు రెఫర్​చేస్తుండగా, అక్కడ కూడా లక్షల్లో బిల్లులు వేస్తూ పేదలను పీల్చిపిప్పి చేస్తున్నారు. 

నార్మల్ డెలివరీలు పెంచేందుకు ప్లాన్

సిజేరియన్ కాన్పుల వల్ల గర్భిణులు, బాలింతల్లో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తి ఇబ్బందులు పడుతున్నారు. కాగా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా సిజేరియన్ కాన్పుల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. నాలుగేండ్లలో హనుమకొండలోని పీహెచ్సీలు, ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో మొత్తంగా 20 వేల వరకు డెలివరీలు జరగగా, దాదాపు 9 వేల వరకు సాధారణ కాన్పులున్నాయి. అంటే గవర్నమెంట్ ఆస్పత్రుల్లో దాదాపు 40 శాతం వరకు నార్మల్ డెలివరీలు జరుగుతున్నాయి. వాటిని మరింత పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు గ్రామస్థాయి నుంచి గర్భిణులు, వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.  

సమస్యలపై ఫోకస్..

ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో శానిటేషన్ సమస్యలు, సిబ్బంది తీరువల్ల చాలామంది ప్రైవేటుకే వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారు. దీంతోనే ప్రభుత్వ ఆస్పత్రుల్లో శానిటేషన్ సమస్యలు పరిష్కరించడంతోపాటు సరిపడా సిబ్బందిని నియమించి మెరుగైన సేవలందించేందుకు సర్కారు రెడీ అవుతోంది. మూడు రోజుల కిందట హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆర్వీ కర్ణన్ హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిని సందర్శించారు. 

అక్కడి డాక్టర్లు, సిబ్బంది వివరాలతో పాటు శానిటేషన్, ఇతర సమస్యలపై ఆరా తీశారు. వాటిని వెంటనే పరిష్కరించాల్సిందిగా పెద్దాఫీసర్లకు ఆదేశాలివ్వడంతో పాటు సర్కారు ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచేందుకు తగిన చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలిచ్చారు. దీంతో జిల్లా ఉన్నతాధికారులు ప్రసూతి ఆస్పత్రులపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు.  

విలేజ్ లెవల్ నుంచి అవేర్నెస్ కల్పిస్తం..

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచేందుకు విలేజ్ లెవల్ నుంచి అవేర్నెస్ కల్పిస్తాం. ఆశా కార్యకర్తల ద్వారా గర్భిణులు, కుటుంబ సభ్యులకు అవగాహన పెంచుతాం. ఇప్పటికే మెటర్నటీ హాస్పిటల్స్ లో శానిటేషన్, స్టాఫ్ విషయంలో సమస్యలు లేకుండా చూస్తున్నాం. ఇదివరకు ప్రసవాలు జరిగిన పీహెచ్ సీలలో కూడా సేవలను పునరుద్ధరిస్తం. గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రుల సేవలను వినియోగించుకోవాలి. - డా.అల్లం అప్పయ్య, డీఎంహెచ్వో, హనుమకొండ