భూగర్భ జలాలు పెంచడానికే చెక్ డ్యాములు : బీర్ల ఐలయ్య

  • ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు : భూగర్భ జలాలను పెంచడానికే చెక్ డ్యాములు నిర్మిస్తున్నట్లు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు. శనివారం యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరులో రూ.1.65 కోట్లతో నిర్మించే చెక్ డ్యాంకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఆలేరు నియోజకవర్గానికి తొలిసారిగా గోదావరి జలాలను తెచ్చి రైతుల సాగునీటి కష్టాలను తీర్చామన్నారు. 

పదేండ్ల బీఆర్ఎస్ అసమర్థత పాలన కారణంగా.. ఆలేరు నెత్తిన మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లు ఉన్నా ప్రజలు గోదావరి నీళ్లకు నోచుకోలేకపోయారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పది నెలల్లోనే ఆలేరుకు గోదావరి జలాలను తెచ్చి అసాధ్యాన్ని సుసాధ్యం చేశామన్నారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే నియోజకవర్గంలో ఇప్పటివరకు 90 చెరువులు నింపామని తెలిపారు.

గోదావరి నీళ్లతో పొంగిపొర్లుతున్న వాగులపై చెక్ డ్యాములను నిర్మించి భూగర్భ జలాల మట్టాన్ని పెంచడానికి కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీశైలం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాలరాజు గౌడ్, ఇరిగేషన్ ఈఈ ఖుర్షీద్ పాషా, డీఈ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.