పదేండ్లున్నా ఏనాడూ రైతులను పట్టించుకోలే : అడ్లూరి లక్ష్మణ్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: రైతులను రెచ్చగొట్టేలా బీఆర్ఎస్  వర్కింగ్  ప్రెసిడెంట్  కేటీఆర్ మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్  అన్నారు. బీఆర్ఎస్  పార్టీ పదేండ్ల పాటు అధికారంలో ఉన్నా..  ఏనాడూ రైతులను పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. రెండు సార్లు అధికారంలో ఉండి రూ.లక్ష  రుణమాఫీ సరిగా చేయలేదని, తరుగు పేరుతో రైతులను మిల్లర్లు దోచుకుంటుంటే ఏనాడూ పట్టించుకోలేదని ఫైర్  అయ్యారు. 

అకాల వర్షాలతో రైతులు నష్టపోతే రూపాయి పరిహారం కూడా ఇవ్వలేదన్నారు. 2023 లో రైతులు కర్రు కాల్చి బీఆర్ఎస్ కు వాత పెట్టారని గుర్తుచేశారు. సంక్రాంతికి రైతుభరోసా ఇస్తామని సీఎం  రేవంత్ రెడ్డి స్పష్టం చేశారని, ఇప్పటికే రూ.2 లక్షల లోపు రుణమాఫీ ఏకకాలంలో చేసి చూపించామని పేర్కొన్నారు. రైతులకు కచ్చితంగా రైతు భరోసా అందుతుందని, రైతులెవ్వరూ ఆందోళన చెందవద్దన్నారు.