క్రిప్టో కరెన్సీలపై బ్యాన్?

క్రిప్టో కరెన్సీలపై బ్యాన్?

న్యూఢిల్లీ: దేశంలోని అన్ని ప్రైవేట్​ క్రిప్టో కరెన్సీలను బ్యాన్​ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. అందుకోసం ‘క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్​ ఆఫ్​ అఫీషియల్​ డిజిటల్​ కరెన్సీ బిల్​2021’ను ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్​సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది.  క్రిప్టో కరెన్సీల కోసం వాడే టెక్నాలజీ (బ్లాక్​చెయిన్) ని మాత్రం ప్రమోట్​ చేసేందుకు, ఆర్బీఐ తెచ్చే అఫీషియల్​ డిజిటల్​ కరెన్సీని ప్రమోట్​ చేయడానికీ బిల్లులో రూల్స్​ను పొందుపరిచినట్టు తెలుస్తోంది. క్రిప్టో కరెన్సీపై పార్లమెంటరీ పానెల్​ ఇప్పటికే కొన్ని సిఫార్సులను చేసింది. దానిని నిషేధించడం కరెక్ట్​ కాదని, కాకపోతే నియంత్రించాలని ఈ పానెల్​ ప్రభుత్వానికి సూచించింది. ఆర్బీఐ మాత్రం క్రిప్టోను రద్దు చేస్తేనే మేలని అంటోంది. యువతను క్రిప్టో వైపు మళ్లించే ప్రకటనలపై చర్యలు అవసరమని పార్లమెంటరీ పానెల్​ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ప్రధాని అధ్యక్షతన జరిగిన హైలెవెల్​ మీటింగ్​ తర్వాత ఈ పార్లమెంటరీ పానెల్​ మీటింగ్​ జరిగింది. ప్రధాన మంత్రితో మీటింగ్​లో వివిధ మంత్రిత్వ శాఖ​ల సీనియర్​ అధికారులతోపాటు, ఆర్​బీఐ అధికారులూ పాల్గొన్నారు. క్రిప్టో కరెన్సీని దేశంలో నిషేధించడమే మేలని, మాక్రో ఎకనమిక్​ స్టెబిలిటీని అది దెబ్బతీస్తుందని రిజర్వ్​ బ్యాంకు మొదటి నుంచీ అభిప్రాయపడుతోంది. కాగా, ఆర్బీఐ సొంతంగా ఓ డిజిటల్​ కరెన్సీని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పైలట్​ప్రాజెక్టుగా దానిని అమలు చేసే తేదీపై కసరత్తులను ప్రారంభించింది. దాని సాధ్యాసాధ్యాలపై స్టడీ చేస్తోంది.