పౌర సమాజం సేవలను  ప్రభుత్వం ఉపయోగించుకోవాలి

దేశ అభివృద్ధి కోసం ప్రభుత్వం, పౌర సమాజం  కలిసి నడవవలసిన ఆవశ్యకత చాలానే ఉందని  సమాజంలో ఉన్న పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవచ్చు.  ప్రధానంగా విభిన్నమైన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు  కుల, మతపరమైన విశ్వాసాలు  కలిగిన మనలాంటి(భారతదేశం) సమాజంలో పౌర సమాజం భాగస్వామ్యానికి ఆవశ్యకత అధికంగానే  ఉంటుంది.  నేటికీ అనేక సమస్యలు పరిష్కారం కాకుండా ఆశించిన స్థాయి అభివృద్ధి జరగకుండా  ఉండటానికి   కారణం కూడా పౌర సమాజం పాత్ర పరిస్థితులకు అనుగుణంగా పెరగక పోవడమే. పాలనా వ్యవస్థ ఒక్కటే నిరంతరం శ్రమించినంత  మాత్రాన అభివృద్ధి సాధ్యం కాదు.  అన్ని రకాల సమస్యలకు  పరిష్కార మార్గం ప్రభుత్వమే చూస్తుంది అనేది,  దశాబ్దాల క్రితం నాటి భావన.  

నేడు  ప్రభుత్వాలు- ప్రజలు కలసి  సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగవలసిన  సహకార యుగంలో ఉన్నామన్న విషయాన్ని పాలకులు,  ప్రజలు గుర్తించాలి. అభివృద్ధి చెందిన దేశాలలో పౌర సమాజం యొక్క పాత్ర రోజు రోజుకూ  అన్ని స్థాయిలలో పెరుగుతుంది. అవి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో కీలక భూమిక పోషిస్తున్నాయి. పౌర సమాజం సహకారం వల్ల అభివృద్ధిని మరింత  వేగవంతంగా సాధించగలుగుతున్నాయి.

ప్రభుత్వేతర  సంస్థలు, సంఘాలు అయినా  విద్యార్థి, ఉద్యోగ, విద్యావంతుల, కార్మిక సంఘాలు, న్యాయవాదుల, డాక్టర్ల సంఘాలు సీనియర్ సిటిజన్స్ వివిధ వృత్తులలో ఉన్నవాళ్లు సంఘాలుగా ఏర్పడి ప్రభుత్వం నిర్వహించే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో తమ వంతు  సహకారాన్ని అందిస్తున్నారు.  అక్కడి పౌర సమాజం అందించే  సలహాలు, సూచనలు, మేధోపరమైన సహకారంను  పొందటం ద్వారా ప్రభుత్వాలు  సులభంగా విజయాలను సొంతం చేసుకుంటున్నాయి.  

సహకార భావన పెరగాలి

మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో  పౌర సమాజం పాత్ర అవసరమైన స్థాయిలో లేకపోవడం విచారకరమైన విషయం. మానవ వనరులు అత్యధికంగా ఉన్నప్పటికీ చైతన్యవంతమైన, విద్యావంతులు, మేధావులు సంఘాలుగా ఏర్పడి సమాజంలోని సమస్యల పరిష్కారంలో పాలుపంచుకోవడం నేటికీ చాలా అరుదు. దీని పర్యావసానంగా  అనేక రకాల  సమస్యలు పరిష్కార కాకుండా అభివృద్ధికి  దూరంగా నిలిచిపోవలసిన  పరిస్థితి ఏర్పడింది.  

అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా  పౌర సంఘాలు,  విద్యావంతులు, మేధావులు, విద్యార్థి, ఉద్యోగ, ఇతర అనేక వృత్తి సంఘాలు తమ సేవలను అందించడానికి ముందుకు రావాలి.  అదేవిధంగా ప్రభుత్వం కూడా పౌర సమాజం సేవలు విరివిగా ఉపయోగించుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టాలి. ప్రజల భాగస్వామ్యాన్ని పెంచకుండా ప్రభుత్వాలకు పాలనాపరమైన విజయాలు అంత సులభంగా సొంతం కావు. 

రాహుల్​ గాంధీ సూచన హర్షణీయం

ఇటీవల తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ  కులసర్వేకు సంబంధించిన సదస్సులో మాట్లాడుతూ కార్యాలయంలో కూర్చుని ఉద్యోగులు తయారుచేసిన ప్రశ్నలతో కాకుండా పౌర సమాజం  రూపొందించిన ప్రశ్నావళితోనే కుల గణన జరగాలని పార్టీ నాయకులకు, ప్రభుత్వానికి సూచించారు. ఆ సదస్సులో పాల్గొన్న అత్యధిక మంది వివిధ ప్రజా సంఘాలకు చెందిన ప్రతినిధులు, మేధావులు,  సామాజిక కార్యకర్తలు పాల్గొనడం విశేషం.

ఒక జాతీయ పార్టీ  పౌర సమాజం యొక్క ప్రాధాన్యతను గుర్తించడం హర్షించదగిన విషయం. భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు పౌర సమాజానికి  ప్రాధాన్యం ఇవ్వనున్నాయనడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. పాలనాపరమైన నిర్ణయాలు అద్దాల మేడలో కూర్చొని కాకుండా ప్రజల క్షేత్రంలో వారి సలహా సూచనలతో తీసుకున్న నిర్ణయాలు సులభంగా అమలు చేయవచ్చు. నేడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న  సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కుల సర్వే  ప్రశ్నావళిని పౌర సమాజం తయారుచేసినదే కావటం విశేషం.  

- నాగుల వేణు యాదవ్, అసిస్టెంట్ ప్రొఫెసర్​–