9 మంది కాదు 90 మంది కళాకారులను గుర్తించాలి

  • మందకృష్ణ మాదిగ డిమాండ్ 

బషీర్ బాగ్, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది కవులు, కళాకారులు పాల్గొన్నారని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 9 మందిని మాత్రమే ఎంపిక చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. ఒక్కో కళాకారుడికి 300 గజాల ఇండ్ల స్థలము, రూ.కోటి నగదు ఇవ్వడాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే 9 మంది కాదు 90 మంది ఉద్యమ కళాకారులను గుర్తించాలని డిమాండ్ చేశారు. అత్యంత పేద కళాకారులను ప్రభుత్వం గుర్తించలేదని ఆరోపించారు. 

ఉద్యమంలో పాల్గొనని రేవంత్ రెడ్డి సీఎంగా ఉండడంతో నిజమైన కళాకారులకు అన్యాయం జరుగుతోందన్నారు. శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు. కమిటీ, జ్యూరీ లేకుండా కళాకారులను ఎంపిక చేయడంతో అసలైన కళాకారులకు అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ ధూంధాంలో రసమయి బాలకిషన్, అంతారపు నాగరాజు కీలకమన్నారు. దళిత మాదిగ కళాకారులు ప్రజలను ఎంతో చైతన్యవంతం చేశారన్నారు.

దరువు ఎల్లన్న, మిట్టపల్లి సురేందర్, దేవరకొండ భిక్షపతి, నేర్నాల కిషోర్, ఏపూరి సోమన్న, తేలు విజయ, వరంగల్ శ్రీనివాస్, రాయపోలు ఎల్లన్న, కొడాలి శ్రీనివాస్, అభినవ శ్రీనివాస్, జంగ్ ప్రహల్లాద, కందికొండ యాదగిరి, అంబటి వెంకన్న, షేక్ బాబా, ఎన్.వై అశోక్, మల్లెపల్లి మోహన్, సదాశివుడు, వేముల పుష్ప వంటి కళాకారులను సీఎం మర్చిపోయాడని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి తన తల్లి రూపంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, ఆ విగ్రహాన్ని తామెందుకు ఆమోదించాలని ప్రశ్నించారు.