100 ఎకరాలలో .. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు

  • చౌటపల్లి వద్ద 100 ఎకరాల కేటాయింపు
  • ముగింపు దశకు రెవెన్యూ సర్వే
  • టీజీఐఐసీ అధికారుల సందర్శన
  • చౌటపల్లి వాసుల అభ్యంతరాలు

సిద్దిపేట, వెలుగు: హుస్నాబాద్ నియోజకవర్గ యువతకు ఉపాధి కల్పించడానికి ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రియల్ పార్క్ కు వడివడిగా అడుగులు పడుతున్నాయి. హుస్నాబాద్ కు12 కిలోమీటర్ల దూరంలోని అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామం వద్ద 312 సర్వే నెంబరులో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు భూ కేటాయింపులు జరిగాయి. దీంతో రెవెన్యూ, టీజీఐఐసీ అధికారులు పార్క్​ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. 

ప్రస్తుతం 85 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని భావించినా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని దీనిని విస్తరించే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 100 నుంచి 150 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటవుతుండడంతో  హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశిస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించి  భూసేకరణ పై రెవెన్యూ అధికారులు ప్రారంభించిన సర్వే ముగింపు దశకు చేరగా, టీజీఐఐసీ అధికారులు పలుమార్లు క్షేత్ర స్థాయి పరిశీలనను పూర్తి చేశారు. 

కాలుష్య రహిత పరిశ్రమల వైపు మొగ్గు

ఇండస్ట్రియల్ పార్క్ లో కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా అధికారులు కసరత్తు జరుపుతున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తే ఆహార ఉత్పత్తులకు మంచి ప్రోత్సాహం లభించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో వరి, పత్తి, మొక్కజొన్న , పప్పు దినుసులు ఎక్కువగా పండిస్తుండడంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. త్వరలో గౌరవెల్లి ప్రాజెక్టు ప్రారంభమైతే నీటి లభ్యత పెరిగి కూరగాయలు సైతం ఎక్కువగా పండించే అవకాశాలు ఉన్నాయి. 

ఇది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అనుకూలంగా మారుతుంది. దీనికి తోడు కరీంనగర్, సిద్దిపేట, హన్మకొండ జిల్లాలకు సమీపంలో ఉండడమే కాకుండా హుస్నాబాద్ మీదుగా నేషనల్​హైవే పనులు దాదాపుగా పూర్తి కావస్తుండంతో ఇండస్ట్రియల్ పార్క్ కు  మెరుగైన రవాణా సౌకర్యాలు ఏర్పడుతాయి. కొత్త పల్లి నుంచి జనగామ రోడ్డును నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరిస్తుండగా దీనికి సమీపంలోనే ఇండస్ట్రియల్ పార్క్ ను ఏర్పాటు చేస్తుండడం సానుకూలాంశంగా మారింది. కరీంనగర్, సిద్దిపేట రైల్వే స్టేషన్లు సైతం 40 కిలో మీటర్ల పరిధిలోనే ఉండడం వల్ల పారిశ్రామిక ఉత్పత్తుల రవాణా సులభంగా జరగనుంది. 

 ఉపాధి అవకాశాలు లభిస్తాయి..

ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుతో హుస్నాబాద్, కోహెడ, అక్కన్న పేట మండలాల్లోని యువతకు ఉద్యోగ అవకాశాల లభ్యత పెరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి ఉపాధి కోసం వెళ్లే వలసలకు అడ్డుకట్టపడుతుంది. స్థానికంగా ఉపాధి లభిస్తే ఆయా కుటుంబాలకు ఆసరా లభించి ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఏర్పడుతుంది.

మంత్రి స్పెషల్ ఫోకస్

ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుపై మంత్రి పొన్నం ప్రభాకర్  ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ చౌటపల్లి వాసులు ఇటీవల ఆందోళన, నిరసన కార్యక్రమాలు ప్రారంభించారు. వారితో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడి ఎవరికీ అన్యాయం జరగకుండా చూడడమే కాకుండా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నారు.

 కానీ ఇండస్ట్రియల్ పార్క్ ప్రతిపాదిత స్థలంలో అసైన్డ్ పట్టాలు పొందిన వారితో పాటు పట్టాలు లేకుండా పొజిషన్ లో ఉన్నవారిలో తీవ్ర ఆందోళన నెలకొంది. కొన్ని దశాబ్దాలుగా వ్యవసాయం చేసుకుంటుంటే ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు వల్ల భూములు కోల్పొతామనే భయంతో  స్థలాల యజమానులు ఉన్నారు. ఈ విషంపై ఆర్డీవో, కలెక్టర్​కు వినతిపత్రాలు ఇచ్చి రెవెన్యూ సర్వేను సైతం అడ్డుకున్నారు.