తెలుగును అధికార భాషగా ప్రకటించిన బెంగాల్ ప్రభుత్వం

తెలుగును అధికార భాషగా ప్రకటించిన బెంగాల్ ప్రభుత్వం
కేవలం రెండు రాష్ట్రాలలో మాత్రమే తెలుగు భాష ఎక్కువగా మాట్లాడుతారు. అయితే ప్రతి రాష్ట్రంలో తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. కానీ ఆ సంఖ్య తక్కువగా ఉంది. కాగా.. పశ్చిమ బెంగాల్‌లో మాత్రం తెలుగు మాట్లాడేవారు అధికంగా ఉండటంతో ఆ రాష్ట్ర్ర ప్రభుత్వం తెలుగును అధికార భాషగా ప్రకటించింది. మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ఖరగ్‌పూర్ ప్రాంతంలో తెలుగు మాట్లాడేవారు ఎక్కువగా నివసిస్తున్నారు. వారు ఎప్పటినుంచో తెలుగును అధికార భాషగా ప్రకటించాలని కోరుతున్నారు. అయితే త్వరలోనే బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దాంతో అధికార టీఎంసీ ప్రభుత్వం ఓటు బ్యాంకు కోసం.. తెలుగును అధికార భాషగా ప్రకటిస్తున్నట్లు తెలిపింది. ఖరగ్‌పూర్ నివాసితులలో ఎక్కువమంది తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. దాంతో వారు తమ భాషను అధికారిక భాషగా గుర్తించాలని స్థానిక ఎమ్మెల్యేకు విజ్ఙప్తి చేశారు. దాంతో ఆ ఎమ్మెల్యే ఈ అభ్యర్థనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకవచ్చారు. తెలుగును అధికారిక భాషగా గుర్తించాలనే నిర్ణయానికి సంబంధించి విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ మాట్లాడుతూ.. ఖరగ్‌పూర్ నివాసితుల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగు భాష మాట్లాడేవారిని మైనారిటీలుగా గుర్తింపు పొందుతారని ఆయన అన్నారు. ఈ నిర్ణయంతో ఖరగ్‌పూర్‌లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడిందని ఆయన అన్నారు. బెంగాల్‌లో హిందీ, ఉర్దూ, నేపాలీ, గురుముఖి మరియు ఒరియాలను కొన్నేండ్ల కిందట అధికారిక భాషలుగా గుర్తించారు. ఆ తర్వాత రాజ్‌బాంగ్‌షి, కామటపురి, సంతాలి భాషలను కూడా అధికారిక భాషల జాబితాలో చేర్చారు. తాజాగా తెలుగును కూడా ఆ జాబితాలో చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా.. బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. టీఎంసీ తమ ఓట్లను పెంచుకోవడం కోసమే తెలుగును అధికారిక భాషగా ప్రకటించిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ అన్నారు. గతంలో దిలీప్ ఘోష్ నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నికలో టీఎంసీ విజయం సాధించింది. వచ్చే ఎన్నికల్లో కూడా ఈ నియోజకవర్గాన్ని వదులుకోకూడదనే టీఎంసీ ఈ ప్రయత్నాలు చేస్తుందని బీజేపీ నాయకులు అంటున్నారు.