పోలీసులపై వేటుకు సిద్ధం

  • తుది దశకు పీడీఎస్​ అక్రమ రవాణా ఎంక్వైరీ 
  • పోలీసుల పాత్రపై ఎస్ బీ, ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్​ రెడీ 
  • 11 మందితోపాటు మరికొందరు పోలీసులు ఉన్నారని తేల్చిన ఆఫీసర్లు 

సూర్యాపేట, వెలుగు : పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాలో పోలీసులపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైంది. పీడీఎస్ రవాణా కేసులో అక్రమార్కులకు సహకరించారనే ఆరోపణల నేపథ్యంలో పోలీస్ శాఖ చేపట్టిన ఎంక్వైరీ తుది దశకు చేరింది. పోలీసుల పాత్రపై ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఎస్బీ, ఇంటెలిజెన్స్ ద్వారా పూర్తి స్థాయిలో నివేదికను తెప్పించుకున్నారు.దీంతో అక్రమార్కులకు సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ కేసులో 11 మందితోపాటు మరికొంతమంది పోలీసులు ఉన్నట్లు తేల్చింది. ఈ క్రమంలో ఎవరిపై వేటు పడుతుందోనని పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  

అక్రమార్కులకు అండగా పోలీసులు..

బీఆర్ఎస్ హయాంలో ఆ పార్టీ లీడర్ల సపోర్ట్ తో జిల్లాలో భారీగా పీడీఎస్ బియ్యాన్ని కాకినాడ పోర్ట్ కు తరలించారనే ఆరోపణలు ఉన్నాయి. వీరికి పోలీసుల సహకారం ఉండడంతో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా సాఫీగా సాగింది. దీంతో అక్రమార్కులు పీడీఎస్ దందాను అడ్డు పెట్టుకొని రూ.100 కోట్లకు పైగా సంపాదించారు. అంతేకాకుండా అక్రమ రవాణాకు సహకరించిన పోలీసులకు భారీగా ముడుపులు అందాయన్న విమర్శలు ఉన్నాయి. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాతోపాటు భూ దందా, గంజాయి రవాణా, సివిల్ సెటిల్ మెంట్లలో సైతం ఆ నలుగురు అక్రమార్కులకు పోలీసులు అండగా నిలిచారు.

 కొంతమంది పోలీసులు ఏకంగా ఎస్కార్ట్ లు పెట్టి మరి పీడీఎస్ బియ్యాన్ని బార్డర్లకు తరలించారనే ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఫోకస్ పెట్టింది. ఇటీవల కాకినాడ పోర్ట్ వ్యవహారంలో జిల్లాకు చెందిన ఈ నలుగురు అక్రమార్కుల పేర్లు తెర మీదకు రావడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వీరి వెనుక పోలీసుల హస్తం ఉన్నట్లు తేలింది. దీంతో మల్టీ జోన్ –2 ఐజీ సత్యనారాయణ పోలీసుల పాత్రపై ఎంక్వైరీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 

తుది దశకు పోలీసుల ఎంక్వైరీ..

పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాలో అక్రమార్కులకు ఎవరు సహకరించారో తేల్చేందుకు ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఎస్బీ, ఇంటెలిజెన్స్ ద్వారా ఎంక్వైరీ చేపట్టారు. కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు ఎవరెవరు ఉన్నారు.. వారికి ఏ విధంగా సహకరించారు.. ఎంత ముడుపులు తీసుకున్నారు..? అనే కోణంలో ఎంక్సైరీ చేసి నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఇందులో 11 కన్నా ఎక్కువ మంది పోలీసుల పాత్ర ఉన్నట్లు సమాచారం.

 కొందరు పోలీసులు జిల్లాలో పని చేస్తుండగా మరికొందరు ఇతర జిల్లాలకు బదిలీ అయ్యారు. బదిలీ అయిన పోలీసుల పేర్లను ఉన్నతాధికారులకు పంపేందుకు రిపోర్ట్ తయారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం జిల్లాలో పని చేస్తున్న వారిపై వేటు పడే అవకాశాలు ఉన్నాయని ఒక పోలీస్ ఉన్నతాధికారి వెలుగుకు చెప్పారు.      

ఇల్లు కట్టించి భక్తి చాటుకున్న పోలీసులు..

పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తికి ఏకంగా కోట్ల ఖరీదైన ఇంటి నిర్మాణానికి పోలీసులు సహకరించారని సమాచారం. ఇంటికి కావాల్సిన ఇసుక, ఐరన్, మట్టి, సిమెంట్ ను పోలీసులే దగ్గరుండి చూసుకున్నట్లు తెలిసింది. నాగారం మండలం నుంచి ఇసుక, హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి సిమెంట్, చివ్వెంల మండలం నుంచి మట్టిని పోలీసులే తరలించి తమ భక్తిని చాటుకున్నారు.   

చర్యలు తీసుకుంటాం  

పీడీఎస్ బియ్యం సరఫరాలో అక్రమార్కులకు సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం వారిపై ఎంక్వైరీ కొనసాగుతోంది. రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తప్పవు.   - ఎస్పీ సన్ ప్రీత్ సింగ్