నకిలీ డాక్టర్లపై ఉక్కు పాదం .. కలకలం రేపిన మెడికల్​ కౌన్సిల్​రైడ్స్​

  • ఇష్టారీతిన యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్​ వాడకం
  • 15 మంది నకిలీ డాక్టర్లపై కేసుల నమోదుకు అంతా సిద్ధం
  • మెడికల్​షాప్​ఓనర్లపై కూడా చర్యలు

నిజామాబాద్, వెలుగు: అర్థంకాని డిగ్రీలను పేర్లకు తగిలించుకొని ట్రీట్​మెంట్​ చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ డాక్టర్లపై కొరడా ఝళిపించడానికి ప్రభుత్వం సిద్ధమైంది.  ఇటీవల రాష్ట్రంలో జరిగిన కొన్ని సంఘటనలను సీరియస్​గా తీసుకొని తెలంగాణ మెడికల్​ కౌన్సిల్ (టీఎంసీ) ను అలర్ట్​ చేసింది.  ఫలితంగా కౌన్సిల్​ వైస్​ చైర్మన్​ జి.శ్రీనివాస్​ ఆధ్వర్యంలోని డాక్టర్ల బృందం దాడులు​ చేసింది. సరైన విద్యార్హతలు లేకుండా వైద్యం చేస్తున్న  350 మందిపై కేసులు నమోదు చేశారు. క్వాలిఫైడ్​ డాక్టర్ల ప్రిస్ర్కిప్షన్​ లేకుండా మెడిసిన్స్​ అమ్ముతున్న షాప్​ ఓనర్లపై చర్యలు తీసుకోనున్నారు. మంగళవారం ఉమ్మడి జిల్లాలో టీఎంసీ రైడ్స్​లో విస్తుబోయే నిజాలు వెలుగు చూశాయి.

అడ్డగోలుగా స్టెరాయిడ్స్​ వాడకం

రోగిని పూర్తగా పరీక్షించిన తర్వాతే​ డాక్టర్​ యాంటీబయాటిక్​ మెడిసిన్స్, డోస్​ సూచిస్తారు. హైడోస్​ యాంటిబయాటిక్స్​ వల్ల ప్రాణాలమీదకు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాంటి వాటిని ఇష్టారీతిలో వాడేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యులను మెడికల్​ కౌన్సిల్​ వైస్​చైర్మన్​ డాక్టర్​ శ్రీనివాస్​ ఆధ్వర్యంలో  డాక్టర్​ బండారి రాజ్​కుమార్, డాక్టర్​ విష్ణు, డాక్టర్​ విజయ్​కుమార్​ పట్టుకున్నారు.   నిజామాబాద్​ సిటీ, ఆర్మూర్, బాన్సువాడ టౌన్​లోని 30 హాస్పిటల్స్​పై రైడ్స్​ నిర్వహించారు. 15 హాస్పిటల్స్, క్లినిక్స్​లో  కిడ్నీలపై నేరుగా​ ప్రభావం చూపే పెయిన్​ కిల్లర్స్, యాంటిబయాటిక్స్​ను​ ఏకకాలంలో రోగులకు ఇవ్వడం చూసి ఆశ్చర్యపోయారు. ఆస్తమా రోగులకు స్టెరాయిడ్ ఇంజెక్షన్​లు ఇస్తున్న విషయాన్ని గమనించారు. 

బాన్సువాడలో ఎలాంటి అర్హతలులేని యువకుడు కంటి వైద్యం చేస్తున్నట్టుగుర్తించారు. ఆయన వద్దకు వచ్చిన రోగులకు అవగాహన కల్పించి వెనక్కి పంపించారు. బోగస్​ డాక్టర్ల విద్యార్హతలను ఆరాతీయగా 15 మందికి వైద్య విద్యతో సంబంధం లేనట్టు తేలింది. వారిలో బీఏ, బీకాం చదవిన వారు నలుగురుండగా, ఇంటర్​ చదివిన మరో నలుగురు,  టెన్త్​ చదివిన  ముగ్గురున్నారు. ఎవరికీ అర్థంకాని డిగ్రీలు నలుగురి వద్ద ఉన్నట్లు గుర్తించారు. అల్లోపతి ట్రీట్​మెంట్​ చేసే అర్హత వారిలో ఎవరికీ లేదు. 

ALSO READ : డంపింగ్​కు జాగా కరువు .. మడికొండ డంపింగ్ యార్డు నిండిపోవడంతో ఎక్కడికక్కడ చెత్తకుప్పలు

అనుబంధంగా మెడికల్​ షాప్​లు 

రకరకాల పేర్లతో హాస్పిటల్స్​ నడుపుతున్న 15 మంది నకిలీ డాక్టర్లు మెడికల్​ షాపులు కూడా నిర్వహిస్తున్నారు. క్వాలిఫైడ్​ డాక్టర్​ ప్రిస్క్రిప్షన్​ మేరకు   మెడిసిన్స్​అమ్మాలి.  స్టెయిరాడ్స్, యాంటీబయాటిక్స్​ను ఫార్మసిస్టు లేకుండా అమ్ముతున్నందున​ డ్రగ్​ కంట్రోలర్​కు తెలిపి షాప్​ లైసెన్స్​రద్దు​ చేయించనున్నారు. 

దాడులు నిరంతరం

ఎంబీబీఎస్​ డాక్టర్​ మాత్రమే అల్లోపతి ​ట్రీట్​మెంట్​ చేయాలి. ఎలాంటి అర్హతలేకుండా నకిలీలు ప్రమాదకరమైన వైద్యం చేయడం వల్ల  వరంగల్, వర్ధన్నపేట, ఖమ్మం, మంచిర్యాల, హుజురాబాద్​లో రోగులు  మరణించారు. అలాంటి ఘటనలు జరగకుండా ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా రాష్ట్రం లో దాడులు చేపట్టాం.  ఇప్పటి వరకు 350 మందిపై కేసులు పెట్టాం. కఠిన శిక్షలు పక్కాగా పడతాయి. రైడ్స్​ ఇంకా కొనసాగిస్తాం.  ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 15 మంది నకిలీ వైద్యులపై పోలీసు​ కేసు​లు పెట్టబోతున్నం.  గ్రామాల్లో  ప్రభుత్వ​ వైద్యం అందుబాటులో ఉంది.    – జి.శ్రీనివాస్​, వైస్​ చైర్మన్ టీఎంసీ