- ఏండ్లుగా అదే స్థలంలో నివసిస్తున్నా పట్టా లేక తిరస్కరణ
- ఇండ్ల స్కీంలో తమకు చోటు కల్పించాలని వేడుకోలు
- భద్రాద్రికొత్తగూడెం జిల్లావ్యాప్తంగా ఇండ్ల కోసం 2,73,493 దరఖాస్తులు
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని సింగరేణి, ఏజెన్సీ ప్రాంత పేదలకు ఇందిరమ్మ ఇండ్ల టెన్షన్ పట్టుకుంది. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ లో భాగంగా అర్హులైన లబ్ధిదారుల ఎంపిక చేసి స్థలం ఉన్నవారికి రూ. 5లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం సర్వే చేపడుతోంది. కానీ జిల్లాలో చాలా మందికి స్థలం ఉన్నా, ఆ స్థలంలోనే ఏండ్ల నుంచి నివసిస్తున్నా వాటికి రిజిస్ట్రేషన్ పట్టా లేకపోవడంతో వారు ఇండ్ల స్కీంకు అర్హత కోల్పోయే అవకాశం ఉంది.
ఇదీ పరిస్థితి..
జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి 2,73,493 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు 37,272 దరఖాస్తులకు సంబంధించి సర్వే చేశారు. కాగా కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు లాంటి సింగరేణి ప్రాంతాల్లోని పేదలకు స్థలం ఉంది.. కానీ, రిజిస్ట్రేషన్ పట్టాలు లేవు. కొత్తగూడెం, ఇల్లెందు, చుంచుపల్లి, లక్ష్మీదేవి పల్లి, పాల్వంచ, అశ్వరావుపేట, దమ్మపేట, భద్రాచలం, మణుగూరు, బూర్గంపహాడ్, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లితో పాటు పలు గ్రామాలు ఏజెన్సీలో ఉన్నాయి. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది.
కొత్తగూడెం మున్సిపాలిటీలో 12 వేల దరఖాస్తులు వస్తే అందులో 2,500 పైగా దరఖాస్తులు రామవరం ప్రాంతానికి చెందినవి ఉన్నాయి. ఇక్కడ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న పేదల్లో 90 శాతం మందికి స్థలం ఉన్నా వాటికి పట్టాలు లేవు. దశాబ్దాల కాలంగా వారు అక్కడ నివసిస్తున్నప్పటికీ 1/70, సింగరేణి ల్యాండ్ అంటూ ఆ స్థలాలను ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయడం లేదు. తాము మున్సిపాలిటీలో ఉన్నప్పటికీ1/70 చట్టం పేర తమను ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌కు దూరం చేస్తున్నారని మండిపడుతున్నారు. వైఎస్సార్ హయాంలో రామవరం ప్రాంతానికి 1,800 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారు.. కానీ, ఇప్పుడు రూ.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల స్కీములో తమకు పట్టా లేదంటూ అన్యాయం చేస్తున్నారని వాపోతున్నారు.
స్కీంకు అర్హత కల్పించాలి
కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరంలోని ఏడు వార్డుల ప్రజలు ఏండ్ల నుంచి అదే స్థలాల్లో నివాసం ఉంటున్నారు. ఇప్పుడు ఆ స్థలాలకు రిజిస్ట్రేషన్ పట్టాలు లేవని ఇందిరమ్మ ఇండ్ల స్కీంలో చేర్చకపోవడం సరికాదు. ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్ స్పందించి వారికి స్కీంలో భాగంగా ఇండ్లు మంజూరు చేయాలి.
– మునిగడప వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, కొత్తగూడెం
ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి
ఏజెన్సీ ప్రాంతంలో దశాబ్దాల కాలంగా గిరిజనులు, గిరిజనేతరులు కలిసి జీవనం సాగిస్తున్నారు. వారికి ఏ మాత్రం స్థలం ఉన్నా వారిని ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు కట్టించేలా చూడాలి. ఈ విషయంలో ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి.
భూక్య రమేశ్, గిరిజన సంఘం నేత కొత్తగూడెం