షాద్​నగర్​ సర్కారు దవాఖానలో ఓపీకి రూ.10

  • షాద్​నగర్ లో చేతివాటం చూపిస్తున్న సిబ్బంది
  • మాకూ ఖర్చులు ఉంటాయంటూ పేషెంట్లకు బెదిరింపులు

షాద్ నగర్, వెలుగు : షాద్​నగర్​లోని ప్రభుత్వ దవాఖాన సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఫ్రీగా ఓపీ ఇవ్వాల్సింది పోయి.. ఒక్కో ఓపీకి రూ.10 వసూలు చేస్తున్నారు. రోజూ ఇక్కడి దవాఖానకు 250 మంది నుంచి 300 పేషెంట్లు వస్తుంటారు. ఓపీ చీటీ రాసి ఇచ్చే సిబ్బంది ఒకరు ప్రతి పేషెంట్​వద్ద రూ.10 వసూలు చేస్తున్నారు. సర్కారు దవాఖానలో ఓపీ ఫీజు ఉండదు కదా.. పైసలు ఎందుకు ఇవ్వాలని ఎవరైనా నిలదీస్తే ‘ప్రైవేట్​దవాఖానలో పైసలు కడతారు కదా? మాకు ఎందుకు ఇవ్వరు? మాకూ ఖర్చులు ఉంటాయ్?

ఓపీ చీటీ కావాలంటే పైసలు కట్టండి లేకుంటే కూలైన్​లో నుంచి పక్కకు తప్పుకోండి?’ సదరు సిబ్బంది బెదిరిస్తున్నారు. చేసేదేమీ లేక షాద్​నగర్​తోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తున్న పేషెంట్లు ఓపీ ఫీజు కింద రూ.10 చెల్లిస్తున్నారు. ఓపీ కౌంటర్​పక్కనే హాస్పిటల్​సూపరింటెండెంట్​రూమ్​ఉన్నా కనీస చర్యలు తీసుకోవడం లేదని పేషెంట్లు మండిపడుతున్నారు. ఈ విషయమై సూపరింటెండెంట్​డాక్టర్.శ్రీనివాస్ రెడ్డిని వివరణ కోరగా సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.