- కామారెడ్డి జిల్లాలో ఆరు నెలల్లో రూ. 614 కోట్ల లోన్లు
- మైక్రో ఎంటర్ ప్రైజెస్ ద్వారా 7,143 మందికి లోన్లు మంజూరు
- మహిళలను చిరు వ్యాపారాల్లో రాణించేలా చేయూత
మహిళా సంఘాలకు ప్రభుత్వం ఆర్థికంగా చేయూత అందిస్తోంది. మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసి, ఉపాధి అవకాశాలు కల్పించి వారు ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం కల్పిస్తోంది. మైక్రో ఎంటర్ ప్రైజెస్‌ల ద్వారా మహిళల ఉపాధిని మెరుగుపరుస్తోంది. బ్యాంకు లింకేజీల ద్వారా సంఘాలకు రుణాలు ఇప్పించటంతో పాటు, సభ్యులకు వ్యక్తిగత లోన్లు మంజూరు చేయిస్తోంది. క్యాంటీన్ల ఏర్పాటు, టైలరింగ్ సెంటర్లు, డెయిరీలు తదితర రంగాల్లో రాణించేలా ప్రోత్సహిస్తోంది. వీటి ద్వారా మహిళలు ఉపాధి పొంది కుటుంబానికి ఆర్థికంగా భరోసా ఇవ్వటానికి వీలుంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో ఆరు నెలల్లో మహిళా సంఘాల గ్రూపులు, మైక్రో ఎంటర్ ప్రైజెస్‌లకు బ్యాంక్ లింకేజీ, స్ర్తీనిధి ద్వారా రూ.614 కోట్ల లోన్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఆయా గ్రూపులు, వ్యక్తిగతంగా కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో 22,007 మందికి ఉపాధి కల్పించేలా ఫ్లాన్ చేసింది. జిల్లాలో 17,098 గ్రూపులు ఉండగా ఇందులో 1.75 లక్షల మంది మెంబర్లు ఉన్నారు.
టైలరింగ్ సెంటర్ల ద్వారా ఉపాధి
మహిళా సంఘాల సభ్యులకు టైలరింగ్ ద్వారా అధికారులు ఉపాధి కల్పిస్తున్నారు. 131 టైలరింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇందుకు గాను రూ. 67 లక్షలు ఖర్చు చేశారు. ఈ సెంటర్లలో స్కూల్ స్టూడెంట్స్యూనిఫామ్స్ కుట్టించారు. జిల్లా సమాఖ్య ద్వారా జిల్లా వ్యాప్తంగా సదాశివనగర్, ముత్యంపేట, పిట్లం, బాన్స్వాడ, కలెక్టరేట్లో క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. ఇలా జిల్లా సమాఖ్య లాభాలు ఆర్జిస్తోంది.
మైక్రో ఎంటర్ ప్రైజేస్లో భాగంలో చిరు వ్యాపారాల్లో రాణించేలా ప్రోత్సహిస్తుంది. కిరాణా షాపులు, హోటల్స్, కూరగాయల అమ్మకం వంటి చిరు వ్యాపారాలకు లోన్లు ఇచ్చారు. చిరు వ్యాపారాల కోసం 11,786 మంది సభ్యులను గుర్తించగా ఆరు నెలల్లో 7,143 మందికి రూ.132 కోట్లు మంజూరు చేశారు. 7,930 గ్రూప్‌లకు రూ. 564 కోట్లు, స్ర్తీ నిధి ద్వారా రూ. 50 కోట్ల మేర రుణాలు ఇచ్చారు. రానున్న రోజుల్లో సంఘాలను ఆర్థికంగా మరింతగా బలోపేతం చేసేందుకు దృష్టిపెట్టారు.
రుణాలు ఉపయోగపడేలా చూస్తున్నాం
మహిళా సమాఖ్యలకు ఇచ్చే రుణాలను ఉపయోగపడేలా చూస్తున్నాం. చిన్న తరహా వ్యాపారాలను ప్రొత్సహించడంతో పాటు, వ్యవసాయ అనుబంధ సంస్థల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రధానంగా నాటుకోళ్లు, గొర్రెల పెంపకం, డెయిరీ ఫామ్, పుట్టగొడుగులు, చేపల పెంపకం, పుడ్ ప్రాసెసింగ్, మల్బరీ సాగు యూనిట్లు ఏర్పాటు చేయిస్తున్నాం. 65 శాతం వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రొత్సహిస్తున్నాం. వీటిని ప్రోత్సహిస్తే వారికి ఆదాయం వస్తుంది. బ్యాంక్లోన్లు సమస్య ఉన్న దగ్గర స్ర్తీనిధి ద్వారా రుణాలు ఇప్పిస్తున్నాం.
సురేందర్, డీఆర్డీవో,కామారెడ్డి