సీఎంఆర్​ ఎగ్గొట్టిన రైస్​ మిల్లర్లకు ధాన్యం బంద్​

  • డిఫాల్టర్​ లిస్ట్​లో 59 రైస్​ మిల్లులు
  • ఈ సీజన్ లో 44 మిల్లులకే ధాన్యం కేటాయింపు 
  • మిగితా ధాన్యం పక్క జిల్లాలకు తరలించేందుకు ఏర్పాట్లు

మెదక్​, వెలుగు: కస్టం మిల్లింగ్​ రైస్​ (సీఎంఆర్​) ఎగ్గొట్టిన రైస్​మిల్లర్లకు ఈ సీజన్​లో ధాన్యం ఇవ్వొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సివిల్​ సప్లై అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. మెదక్ జిల్లాలో మొత్తం 104 రైస్​ మిల్లులు ఉన్నాయి. అందులో 36 బాయిల్డ్​ రైస్​ మిల్లులు కాగా, 68 రా రైస్​ మిల్లులు ఉన్నాయి.  వానాకాలం, యాసంగి సీజన్లలో  కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి కొనే ధాన్యాన్ని  మిల్లింగ్​ కోసం రైస్​ మిల్లులకు సరఫరా చేసి వారి నుంచి బియ్యం సేకరిస్తారు. కాగా 2019–-20, 2020–-21, 2021–-22 సీజన్​లలో చాలా మిల్లులు సీఎంఆర్​  ఇవ్వలేదు. 

బాయిల్డ్​ మిల్లులకు సంబంధించి 1,741 టన్నుల సీఎంఆర్​  (రూ.13.13 కోట్లు) బాకీ ఉంది. ఇందులో రూ.1.62 కోట్లు మాత్రమే రికవరీ కాగా ఇంకా రూ.11.41 కోట్ల విలువైన సీఎంఆర్​ బాకీ ఉంది. అలాగే రా రైస్​ మిల్లులకు సంబంధించి 800 టన్నుల (రూ.26.56 కోట్లు) సీఎంఆర్​ బాకీ ఉంది. ఇందులో రూ.1.53 కోట్లు మాత్రమే రికవరీ కాగా రూ.25 కోట్లు బాకీ ఉంది. ఈ నేపథ్యంలో డిఫాల్టర్​గా ఉన్న రైస్​ మిల్లులకు ఈ వానాకాలం సీజన్​లో ధాన్యం కేటాయించొద్దని నిర్ణయించారు. 

36 బాయిల్డ్​ రైస్​ మిల్లుల్లో ఒక మిల్లుపై కేసు నమోదు కాగా, 24 మిల్లులు డిఫాల్టర్​ లిస్ట్​ లో ఉన్నాయి. అవి పోను మిగిలిన 11 బాయిల్డ్​ రైస్​ మిల్లులకు మాత్రమే ధాన్యం కేటాయించనున్నారు. 68 రా రైస్​ మిల్లులలో 27 మిల్లులు డిఫాల్టర్​ లిస్ట్​లో ఉన్నాయి. మరో 8 మిల్లుల్లో సార్టెక్స్​ ఫెసిలిటీ లేదు. దీంతో అవి పోను మిగిలిన 33 రా రైస్​ మిల్లులకు మాత్రమే ఈ సీజన్​ లో ధాన్యం కేటాయించనున్నారు.  

ఇతర జిల్లాలకు తరలింపు

జిల్లాలో 11 బాయిల్డ్​, 33 రా రైస్​ మిల్లులు కలిపి 44 రైస్​ మిల్లులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.  కొనుగోలు కేంద్రాల ధ్వారా కొనుగోలు చేసే ధాన్యంలో 1.70 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం ఆ మిల్లులకు సరఫరా చేయనున్నాం. మరో ఒక లక్ష మెట్రిక్​ టన్నుల ధాన్యాన్ని ఇతర జిల్లాల్లోని మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేస్తాం. - హరికృష్ణ, సివిల్​ సప్లై డీఎం, మెదక్​ జిల్లా