మెదక్ లో కొత్త సొసైటీలకు కసరత్తు

  • పీఏసీఎస్ ల రీ ఆర్గనైజేషన్ కు ప్రభుత్వం చర్యలు
  • మెదక్ జిల్లాలో ప్రస్తుతం 37 పీఏసీఎస్ లు
  • కొత్తగా 29 పీఏసీఎస్ ల ఏర్పాటుకు ప్రపోజల్స్

మెదక్, వెలుగు: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్​) రీ ఆర్గనైజేషన్​కు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. రైతులకు క్రాప్​ లోన్ల మంజూరు, ఎరువులు, విత్తనాల విక్రయం, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ వంటి సేవలందిస్తున్న పీఏసీఎస్​లను మరిన్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న సొసైటీలను పునర్‌‌ వ్యవస్థీకరించి మరిన్నికొత్త సొసైటీలు ఏర్పాటు చేసే దిశగా కార్యాచరణ షురూ చేసింది. 

ఈ మేరకు అన్నిజిల్లాల సహకార శాఖ అధికారులు (డీసీవో)ల నుంచి ప్రభుత్వం ప్రపోజల్స్​తీసుకుంది.ప్రస్తుతం మెదక్ జిల్లాలోని 21 మండలాల పరిధిలో 37 పీఏసీఎస్​లు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు సహకార శాఖ అధికారులు కొత్త సొసైటీల ఏర్పాటు కోసం ప్రపోజల్స్​కోరారు. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న పీఏసీఎస్​ల చైర్మన్లు, డైరెక్టర్లు, ఆయా గ్రామాల రైతుల నుంచి కొత్త పీఏసీఎస్​ల ఏర్పాటు కోసం 29 ప్రపోజల్స్​ డీసీవో ఆఫీస్​కు అందాయి. 

మెదక్​ సొసైటీ పరిధిలో హవేలీ ఘనపూర్​, నర్సాపూర్​ సొసైటీ పరిధిలో రెడ్డిపల్లి, తూప్రాన్​ సొసైటీ పరిధిలో మనోహరాబాద్, వెల్దుర్తి సొసైటీ పరిధిలో మాసాయిపేట, టేక్మాల్​ సొసైటీ పరిధిలో పల్వంచ, ధనూర, ఎల్లుపేట, బొడ్మట్​పల్లి, చేగుంట మండలంలోని ఇబ్రహీంపూర్​ సొసైటీ పరిధిలో మక్కరాజ్​పేట, చందాయిపేట, రామాయంపేట సొసైటీ పరిధిలో నస్కల్​, చల్మెడ, నార్లాపూర్, డి.ధర్మారం, కాట్రియాల, అల్లాదుర్గం సొసైటీ పరిధిలో ముస్లాపూర్​, పెద్ద శంకరంపేట సొసైటీ పరిధిలో ధనంపల్లి, రామోజిపల్లి, పాపన్నపేట సొసైటీ పరిధిలో అర్కెల, చిత్రియాల్, మల్లంపేట, కొత్తపల్లి సొసైటీ పరిధిలో కొడపాక, శివ్వంపేట సొసైటీ పరిధిలో గోమారం, దొంతి, చిలప్​చెడ్ మండలంలోని సోమక్కపేట సొసైటీ పరిధిలో చిలప్​చెడ్, ఫైజాబాద్, చిట్కుల్, కౌడిపల్లి మండలంలోని మహ్మద్ నగర్​ సొసైటీ పరిధిలో వెంకట్రావ్​పేట, పాంపల్లి లో కొత్త సొసైటీల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు వచ్చాయి. 

రైతులకు అనుకూలంగా ఉండాలి

కొత్తగా మరిన్ని సొసైటీలు ఏర్పాటు చేయాలన్న ఆలోచన మంచిదే. ప్రస్తుతం ఉన్న కొన్ని సొసైటీల పరిధిలో గ్రామాల సంఖ్య, రైతుల సంఖ్య ఎక్కువగా ఉంది. దానివల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. అలాంటి చోట కొత్త సొసైటీల ఏర్పాటు వల్ల రైతులకు సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుత సొసైటీ పాలకవర్గాల, సంబంధిత గ్రామాల రైతుల అభిప్రాయాలు తీసుకుని కొత్త సొసైటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. శ్రీహరి, పీఏసీఎస్ ​చైర్మన్, నాగాపూర్​

ALSO READ : ఓల్డ్ సిటీ మెట్రో పిల్లర్ల ఎత్తు పెంచండి 

రైతులకు మరింత చేరువయ్యేందుకు..

రైతులకు సేవలు మరింత చేరువ చేసేందుకు మరిన్ని కొత్త పీఏసీఎస్​లను  ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో కొత్తగా 29 పీఏసీఎస్​ల ఏర్పాటు కోసం ప్రపోజల్స్​ పంపించాం. మరిన్ని ప్రపోజల్స్​ వచ్చే అవకాశం ఉంది. భౌగోళిక పరిస్థితులు, రైతుల సంఖ్య ప్రస్తుతం ఉన్న పీఏసీఎస్​ల పరిధి గ్రామాల మధ్య దూరం తదితర అంశాలను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.  - కరుణాకర్, ఇన్​చార్జి డీసీవో, మెదక్