కాకతీయ యూనివర్సిటీపై ప్రభుత్వం ఫోకస్

  • వర్సిటీ డెవలప్ మెంట్ కు డీపీఆర్ రెడీ చేయాలని సర్కారు ఆదేశాలు
  • 16 మంది ప్రొఫెసర్లతో ప్రత్యేక కమిటీ
  • ఐదేండ్ల ప్రణాళికతో కసరత్తులు 
  • సమస్యల పరిష్కారం, వసతుల కల్పనకు ప్రతిపాదనలు
  • కొత్త పనులకూ ప్రపోజల్స్​

హనుమకొండ, వెలుగు: రాష్ట్రంలో ఉస్మానియా తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న కాకతీయ యూనివర్సిటీ ఇన్నాళ్లూ వివాదాలకు అడ్డాగా మారింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వర్సిటీ ప్రక్షాళనపై ఫోకస్​పెట్టింది. ఇప్పటికే కేయూ భూముల ఆక్రమణలపై విజిలెన్స్​విచారణ జరిపిస్తుండగా, ఇప్పడు వర్సిటీలో సమూల మార్పులపై కసరత్తు చేస్తోంది. వర్సిటీ అవసరాలకు అనుగుణంగా వివిధ ప్రతిపాదనలతో డీటైల్డ్​ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారు చేయాల్సిందిగా ఆదేశాలిచ్చింది. ఇందుకు ఓ ప్రత్యేక కమిటీని కూడా నియమించింది. కేయూ పరిధిలో నెలకొన్న సమస్యలతోపాటు వసతుల కల్పన తదితర అంశాలపై డీపీఆర్​కమిటీ సభ్యులు కసరత్తు చేస్తున్నారు.

సమూల మార్పులకు డీపీఆర్..​

కాకతీయ యూనివర్సిటీ ఇంతకాలం వివిధ అక్రమాలు, వివాదాలకు అడ్డాగా కొనసాగింది. వర్సిటీకి సరిపడా నిధులు మంజూరు కాకపోవడం, టీచింగ్, నాన్​టీచింగ్ స్టాఫ్​పోస్టులు భర్తీకి నోచుకోకపోవడం, కొత్త కోర్సులు తీసుకురాకపోవడం, వర్సిటీ భూముల ఆక్రమణలు, పీహెచ్ డీ సీట్ల అక్రమాలు, హాస్టల్ ఇబ్బందులతో విద్యార్థుల ఆందోళనలు, చివరకు కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులకు కూడా కమీషన్లు ఇలా నానారకాల సమస్యలతో కేయూ సతమతమైంది. విద్యార్థులు కూడా కేయూ పేరు చెబితేనే జంకే పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వ హయాంలో వర్సిటీ తీరు తీవ్ర విమర్శల పాలవగా, పీహెచ్​డీ అక్రమాల నేపథ్యంలో విద్యార్థులు చేపట్టిన నిరసన దీక్షకు అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్​రెడ్డి హాజరయ్యారు.

 కాంగ్రెస్​ప్రభుత్వం రాగానే వర్సిటీని ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో నవంబర్ 30న ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్​ రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎంపీ కడియం కావ్య, ఇతర నేతలు వర్సిటీని విజిట్​చేశారు. ఆఫీసర్లతో సమావేశమై వర్సిటీ డెవలప్​మెంట్​కు అవసరమైన ప్రతిపాదనలతో డీపీఆర్ రెడీ చేయాల్సిందిగా ఆదేశాలిచ్చారు. దీంతో కొద్దిరోజుల్లోనే వర్సిటీ రూపురేఖలు సమూలంగా మారడంతోపాటు స్టాఫ్​కొరత, ఇతర అన్ని సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం కనిపిస్తోంది. 

ఐదేండ్ల ప్రణాళిక, 16 మంది ప్రొఫెసర్లతో కమిటీ..

సీఎం ఆదేశాలతో కేయూ ప్రక్షాళనకు డీపీఆర్​ రెడీ చేయడానికి వర్సిటీకి చెందిన 16 మంది ప్రొఫెసర్లతో ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేశారు. కాలేజ్​డెవలప్​మెంట్​కౌన్సిల్​డీన్​ ప్రొఫెసర్​ వి.రామచంద్రం ఈ కమిటీకి చైర్మన్​ గా వ్యవహరిస్తుండగా, యూజీసీ కోఆర్డినేటింగ్​ఆఫీసర్ మల్లికార్జున రెడ్డి కన్వీనర్​గా కొనసాగుతున్నారు. వీరిద్దరితోపాటు వివిధ డిపార్ట్​మెంట్లకు చెందిన 14 మంది ప్రొఫెసర్లతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. వీళ్లంతా కలిసి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐదేళ్ల ప్రణాళికగా వివిధ అంశాలపై కసరత్తు చేస్తున్నారు. వర్సిటీ సమస్యలు, కొత్త కోర్సులు, కావాల్సిన నిధులు, భూ ఆక్రమణలు, హాస్టల్​ప్రాబ్లమ్స్, ఇతర సమస్యలు, కొత్త పనులకు అవసరమైన ప్రతిపాదనలపై కమిటీ సభ్యులు ప్రణాళికలు రచిస్తున్నారు. 

కేయూకు నేషనల్​ర్యాంకింగ్స్, మౌలిక వసతుల కల్పన, రీసెర్చ్​యాక్టివిటీ పెంచడం, స్కిల్​సెంటర్ల ఏర్పాటు, విద్యార్థులకు క్వాలిటీ టీచింగ్ అందించేందుకు అవసరమైన అన్ని రకాల ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు. ఈ నెల 23న మరోసారి కమిటీ సభ్యులతో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సమావేశం కానున్నారు. కమిటీ రెడీ చేసిన డీపీఆర్​పై మార్పులు, చేర్పులు చేయనున్నారు. 

అందరి అంగీకారం మేరకు కేయూ డీపీఆర్​ను ప్రభుత్వానికి పంపిస్తారు. సీఎం రేవంత్​రెడ్డి ఆమోద ముద్ర వేసిన వెంటనే కేయూ ప్రక్షాళనకు పూర్తిస్థాయిలో అడుగులు పడనున్నాయి. గతానికి భిన్నంగా కేయూ ప్రక్షాళనకు లీడర్లు, ఆఫీసర్లు పావులు కదుపుతుండగా, వర్సిటీ ఉద్యోగ, విద్యార్థి సంఘాల్లో కూడా హర్షం వ్యక్తమవుతోంది.