రైతులకు గుడ్ న్యూస్: 1350 రూపాయలకే 50 కేజీల DAP ఎరువుల బస్తా..!

దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.. 50 కేజీల డీఏపీ ఎరువుల బస్తాను 1350 రూపాయలకే అందించనున్నట్లు ప్రకటించింది కేంద్రం. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు. 2025, జనవరి ఒకటో తేదీన రైతులకు శుభవార్త అని వివరించారు కేంద్ర మంత్రి. 

ఇప్పటి వరకు మార్కెట్ లో 50 కేజీల డీఏపీ ఎరువుల బస్తా 1350 రూపాయలే ఉంది.. 2025 జనవరి ఒకటో తేదీ నుంచి డీఏపీ ఎరువుల బస్తాపై 300 రూపాయలు పెంచుతున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. అంటే ఇక నుంచి కొనుగోలు చేసే డీఏపీ 50 కేజీల ఎరువుల బస్తా 1650 రూపాయలు కానుంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. డీఏపీ ఎరువుల బస్తాపై ఆయా కంపెనీలు పెంచుతున్న 300 రూపాయల ధరను.. కేంద్రమే సబ్సిడీ రూపంలో ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 2024లో ఉన్న ధర 1350 రూపాయలకే రైతులకు అందించనున్నట్లు స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం.

రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ. 3,850 కోట్ల వరకు ప్రత్యేక ప్యాకేజీని ఆమోదించింది. ఈ ఆర్థిక సహాయం డై-అమ్మోనియం ఫాస్ఫేట్ (DAP) ఎరువుల ధరను 50 కిలోల బస్తాకు రూ.1,350గా నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకుంది, ఇది రైతులకు గిట్టుబాటు అయ్యేలా ఉంది.

బుధవారం (జనవరి 1,2025) నాడు కేంద్ర కేబినెట్‌ జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నిధులు 69,515 కోట్లకు పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది. నాలుగు కోట్ల మంది రైతులకు లబ్ది చేకూరనుంచింది. 

ఇటీవల పెరిగిన డీఏపీ ఎరువులపై అదనపు భారాన్ని కేంద్రం భరించాలని నిర్ణయించింది. పెంచిన ధర రూ. 300 భారాన్ని తగ్గించి డీఏపీ బస్తా రూ.1350లకే 50 కిలోల అందించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 

2025 నూతన సంవత్సరంలో తొలి కేబినెట్ లో రైతు సంక్షేమానికి ప్రాధాన్యనిస్తూ.. డీఏపీ ఎరువుల సబ్సిడీ రూ.3850 కోట్లు పెంచుతూ ఆమోదం తెలిపింది. ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీకి 800 కోట్ల కేటాయించింది. 2014 -24 వరకు ఎరువుల సబ్సిడీకి 11.9 లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం.