పామాయిల్​ సాగుకు సర్కారు సాయం

  • ఆయిల్ ​పామ్​పై ప్రభుత్వాల దృష్టి
  • దేశీయ సాగుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం
  • సాగుపై అవగాహనకు ఆఫీసర్ల సందర్శన
  • రాయితీపై మొక్కలు, నీటి పరికరాలు
  • మార్కెట్ లో టన్ను గెల రూ.20,413

బాల్కొండ, వెలుగు:  తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు విస్తరణపై దృష్టి సారించింది. 2024–-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో లక్ష ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుచేయాలని, రానున్న నాలుగేళ్లలో  5.50 లక్షల ఎకరాలకు పెంచాలని నిర్ణయించింది.  ప్రస్తుతం అత్యధికంగా ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది.  5 లక్షల ఎకరాలతో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. రానున్న ఐదారేండ్లలో ఏపీని అధిగమించి దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. దేశానికి సరిపడా పామ్ ఆయిల్ ఉత్పత్తి చేసే సామర్థ్యం తెలంగాణ రైతులకు ఉందని ఇటీవల అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.  

  ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించేలా ప్రతీవారం శాస్త్రవేత్తలు, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు ఆయా జిల్లాల్లో కనీసం వారానికి రెండు మండలాలు సందర్శించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎకరా వరి పండించే నీటితో 5 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయొచ్చు. మొక్కలు నాటిన ఆరేళ్ల నుంచి 30  ఏండ్ల వరకు దిగుబడి ఇస్తుండటంతో రైతుల్లో మంచి స్పందన వస్తోంది. కొనుగోలు సమస్య లేకపోవటంతో పాటు ఫ్యాక్టరీ యాజమాన్యమే కొనుగోలు చేస్తుండటంతో రైతులకు మేలు జరుగుతోంది.

రాయితీ పైన మొక్కలు, నీటి పరికరాలు

ఆయిల్ పామ్ సాగుకు మొగ్గు చూపిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా మొక్కలతో పాటు పంట సాగుకు అవసరం అయ్యే డ్రిప్​ ఇరిగేషన్​ సిస్టమ్​ రాయితీపై అందిస్తుంది. ఒక్క ఆయిల్ పామ్ మొక్క రూ.193 కాగా, రైతులకి కేవలం రూ.20 రూపాయలకే అందిస్తుంది.  డ్రిప్ పరికరాలను 80- నుంచి 90% సబ్సిడీలో అందిస్తుంది.  ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు అంతర పంటలు వేసుకునేందుకు ఎకరానికి రూ.4,200 చొప్పున నాలుగు సంవత్సరాల వరకు రూ. 16,800  అందిస్తుంది.

టన్ను గెల రేటు రూ. 20,413

గత నాలుగైదేళ్లతో పోల్చితే ప్రస్తుతం ఆయిల్ పామ్ రైతులకు​ గరిష్ట లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాల నుంచి దిగుమతయ్యే పామాయిల్ పై 20 శాతం సుంకం విధిస్తూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఫలితంగా నవంబర్ లో పామాయిల్ రేటు టన్నుకు రూ. 20,413 పెరిగింది. గతంలో ఇంతకంటే అధిక లాభాలు ఆర్జించారు. 

ఆయిల్ పామ్ సాగుతో లాభం

రెండేళ్ల క్రితం 6 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటా. వచ్చే జూన్ నుంచి పంట చేతికొస్తుంది. ఇప్పటి వరకు పంట నిర్వహణ కోసం ఎకరానికి రూ.4,200 చొప్పున రూ.24,000 రెండు సార్లు నా ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. ఇప్పటికే ఒక్కో చెట్టుకి 15-16 గెలల వరకు వస్తున్నాయి.   - వేల్పూర్ శ్రీనివాస్, కోడిచెర్ల,ఆయిల్ పామ్ రైతు 

ALSO READ : కామారెడ్డి జిల్లాలో వడ్లు పక్కదారి పట్టించిన.. రైస్ మిల్లు ఓనర్ పై కేసు

సులభంగా సాగుచేయొచ్చు 

సాధారణ పంటల సాగుతో ఆశించిన మేర ఆదాయం రావడంలేదు. దీనికి ఆయిల్ పామ్ పంట ప్రత్యామ్నాయంగా రైతులు భావిస్తున్నారు.  సాగు మొదలుపెట్టిన నాలుగేళ్ల తర్వాత దిగుబడి ప్రారంభం అవుతుంది. ఎకరానికి 10-15 టన్నుల వరకు సుమారు రూ.2 నుంచి రూ.3 లక్షల దిగుబడి వస్తుంది.   రూ.2.50 లక్షల వరకు మిగులుతుంది.  - రుద్ర వినాయక్, డివిజనల్ ఉద్యాన అధికారి, బాల్కొండ