ఇంటర్‌‌‌‌లో అకడమిక్ ఆఫీసర్లు..ఒక్కో ఉమ్మడి జిల్లాకు ఒక్కో అధికారి నియామకం 

గవర్నమెంట్ కాలేజీల బలోపేతానికి సర్కార్ చర్యలు 

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ జూనియర్ కాలేజీలను బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆశించిన స్థాయిలో అడ్మిషన్లు రాకపోవడం, పాస్ పర్సంటేజీ తగ్గడానికి కారణాలు తెలుసుకోవడానికి అకడమిక్ ఆఫీసర్లను నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ విద్యాసంవత్సరంలో 425 సర్కారు కాలేజీల్లో అడ్మిషన్లు జరిగాయి. వీటిలో ఏటా కనీసం లక్షకుపైగా విద్యార్థులు చేరాల్సి ఉండగా.. ఆ మేర అడ్మిషన్లు ఉండటం లేదు. అలాగే, కొన్నేండ్లుగా పలు కాలేజీల్లో పాస్ పర్సంటేజీ తగ్గిపోతున్నది. వీటిని సరిచేసేందుకు ఇంటర్మీడియెట్ కమిషనరేట్ కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. కమిషనరేట్​లో అకడమిక్ సెల్​ను ఏర్పాటు చేసింది.

ఒక్కో ఉమ్మడి జిల్లాకు ఒక్కో అధికారిని నియమించింది. వాళ్లంతా వారంలో రెండ్రోజులు ఆయా జిల్లా పరిధిలోని కాలేజీలను విజిట్ చేయాల్సి ఉంటుంది. సిలబస్ టైమ్ ప్రకారం జరుగుతున్నదా? డైరీ మెయింటెన్ చేస్తున్నారా? చదువులో వెనుకబడిన స్టూడెంట్లకు స్పెషల్ క్లాసులు తీసుకుంటున్నారా? తదితర వివరాలు సేకరించనున్నారు. అటెండెన్స్, రిజల్ట్ పెంపునకు కాలేజీలు చర్యలు తీసుకుంటున్నాయా? అనే డేటాను కలెక్ట్ చేయనున్నారు. ‘లో పర్ఫామెన్స్’ ఉన్న కాలేజీల్లో అటెండెన్స్, పాస్ పర్సంటేజీ ఎందుకు తగ్గుతున్నది? అనేదానిపై లెక్చరర్లు, ప్రిన్సిపాల్, డీఐఈవో వివరణ తీసుకుంటారు. ఈ సమాచారంతో నివేదికను తయారు చేసి ఇంటర్ కమిషనర్​కు పంపించనున్నారు. దాని ఆధారంగా కాలేజీల బలోపేతానికి చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు.  

స్పెషల్ ఆఫీసర్లు వీరే.. 

ఉమ్మడి జిల్లాల ఆధారంగా స్పెషల్ ఆఫీసర్ల(అకడమిక్)ను ఇంటర్మీడియెట్ కమిషనర్ కృష్ణ ఆదిత్య నియమించారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని కొత్త జిల్లాల్లో వీరంతా ఒక్కో వారం పర్యటించాల్సి ఉంటుంది. హైదరాబాద్ జిల్లాకు జ్యోత్న్స, రంగారెడ్డికి వెంక్యా నాయక్, మహబూబ్ నగర్ కు లక్ష్మారెడ్డి, నిజామాబాద్​కు ఒడ్డెన్న, మెదక్​కు కిషన్, ఖమ్మంకు యాదగిరి, నల్గొండకు భీంసింగ్, ఆదిలాబాద్​కు రమణారావు, కరీంనగర్​కు వసుంధర, వరంగల్ కు యాదగిరిని స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు.