యూనివర్సిటీలకు పాలకమండళ్లను నియమించాలి

ఇటీవల ప్రభుత్వం రాష్ట్రంలో రెండు యూనివర్సిటీలు మినహాయించి అన్ని యూనివర్సిటీలకు‌‌‌‌‌‌‌‌ వైస్ చాన్సలర్లను నియమించింది.  గత  బీఆర్ఎస్​ ప్రభుత్వం  మాదిరిగా  కాకుండా,  ఎక్కువ రోజులు కాలయాపన చేయకుండా అన్ని వర్గాలకు సమున్నత స్థానం కల్పిస్తూ  యూనివర్సిటీలకు‌‌‌‌‌‌‌‌  వైస్ ఛాన్సలర్లను  నియమించడం స్వాగతించదగిన అంశం.  యూనివర్సిటీ అభివృద్ధిలో‌‌‌‌‌‌‌‌  వైస్ ఛాన్సలర్లు ఎంత ముఖ్యమో,  యూనివర్సిటీ పాలక మండలి కూడా అంతే ముఖ్యం.  గత  ప్రభుత్వం  నియమించిన యూనివర్సిటీల  పాలకమండళ్లు  రద్దు కావడం జరిగింది.  కొన్ని యూనివర్సిటీల్లో  ఉన్నప్పటికీ అవి  నామమాత్రంగానే  పనిచేయడం జరుగుతోంది.  వైస్ ఛాన్సలర్లు  ఏదైనా అభివృద్ధి పనులను ప్రారంభించాలి అంటే  వారికి  రూ. పది లక్షల కంటే మించి నిధులను కేటాయించే పరిస్థితి లేదు.  

ఎందుకంటే రూ.10 లక్షల పైన నిధులను కేటాయించాలంటే పాలకమండలి అనుమతి తప్పనిసరి కావడంతో ఈ సమస్యను  ప్రస్తుతం  యూనివర్సిటీల  వైస్ ఛాన్సలర్లు  ఎదుర్కోవడం జరుగుతోంది.  గతంలో నిలిచిపోయినటువంటి  పనులను కూడా తిరిగి ప్రారంభించే పరిస్థితిలో లేరు.  గత ప్రభుత్వం అన్ని యూనివర్సిటీలకు పాలకమండలిలో అధికార పార్టీతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులను,  ఎలాంటి  పరిపాలన అనుభవం లేని వ్యక్తులను నియమించిన కారణంగా ఉప కులపతులు ఇష్టారాజ్యంగా,  నిరంకుశంగా వ్యవహరిస్తూ అవినీతికి పాల్పడినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. వైస్ ఛాన్సలర్లు చేసే అవినీతిని ప్రశ్నించే సమర్థవంతమైన పాలకమండలి గతంలో  లేకపోయింది.  దీని ద్వారా యూనివర్సిటీ పాలన అస్తవ్యస్తంగా మారిపోయింది. ప్రస్తుతం  సలహాలు, సూచనలు ఇచ్చేటటువంటి యూనివర్సిటీ పాలకమండలి అవసరం  ఉన్నది.  సీఎం రేవంత్​ రెడ్డి సారథ్యంలోని  ప్రస్తుత  కాంగ్రెస్​  ప్రభుత్వం  పరిపాలన అనుభవం ఉండి యూనివర్సిటీ పరిపాలనపై సమర్థవంతంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులను  పాలకమండలిలో నియమించాలి.  అవినీతితో సంబంధం లేని వ్యక్తులను పాలకమండలి సభ్యులుగా నియమించి యూనివర్సిటీలు అభివృద్ధి చేసేవిధంగా ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉంది.  ఇప్పటికే చాలా ఆలస్యమైనప్పటికీ ప్రభుత్వం వెంటనే ఆలోచించి యూనివర్సిటీలకు పాలకమండళ్లను నియమించాలి.

- ఎం. సుమన్ శంకర్,
ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్