ఏసీబీకి చిక్కిన గోపాల్​పేట్​ తహసీల్దార్

  •     నాలా కన్వర్షన్​ కోసం రూ.8 వేలు డిమాండ్​

గోపాల్ పేట, వెలుగు : వనపర్తి జిల్లా గోపాల్ పేట తహసీల్దార్​ శ్రీనివాసులు నాలా కన్వర్షన్​ కోసం రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ కథనం ప్రకారం..గోపాల్ పేట మండలం జింకలబీడు తండాకు చెందిన దంపతులు మూడవత్ పాండు, రాత్లవత్ సౌందర్య పేరుపై సర్వే నంబర్​120/ఉ/2/1/2 లో 30 గుంటల భూమి ఉంది. అందులో 15 గుంటల భూమిని నాలా కన్వర్షన్ కింద మార్చుకొనేందుకు జూన్ 20న ధరణిలో రూ.4 వేలు చలాన్ కట్టి అప్లై చేసుకున్నాడు. మరుసటి రోజు తహసీల్దార్​ను కలవగా, రూ.15 వేలు డిమాండ్  చేశాడు. అంత ఇచ్చుకోలేనని బాధితుడు చెప్పగా, రూ.8 వేలకు ఒప్పుకొని ఇవాళ చేస్తా.. రేపు చేస్తా.. అని తిప్పించుకుంటున్నాడు. విసిగిపోయిన రైతు జూన్ 26న ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ సూచనతో బుధవారం సాయంత్రం తహసీల్దార్ ​శ్రీనివాసులుకు రూ.8వేలు ఇవ్వగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తర్వాత తహసీల్దార్​ ఇంట్లో సోదాలు చేశారు. ఎంక్వైరీ తర్వాత నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని డీఎస్పీ తెలిపారు. ఏసీబీ ఇన్​స్పెక్టర్లు రామారావు, వెంకట్రావు, అబ్దుల్ ఖాదర్, లింగస్వామి పాల్గొన్నారు.