- ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సంస్థ
- ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఇంజినీరింగ్ సెంటర్
- ఆసియా పసిఫిక్ రీజియన్‌లో ఇది రెండోది
- -సైబర్ సెక్యూరిటీకి తోడ్పాటు..టెక్నలాజికల్ ఎకో సిస్టమ్‌కు ఊతం
- -సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబుతో సంస్థ ప్రతినిధుల భేటీ
- ఐటీ, ఇన్నోవేషన్ హబ్‌లో హైదరాబాద్ లీడర్ : రేవంత్‌రెడ్డి
- డిజిటల్ స్కిల్ డెవలప్మెంట్లో ఎప్పుడూ ముందుంటుందని వెల్లడి
- సేఫ్టీ ఇంజినీరింగ్‌లో హైదరాబాద్ గ్లోబల్ లీడర్ : రాయల్ హాన్సెన్
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం గూగుల్‌తో కీలక ఒప్పందం చేసుకున్నది. దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (జీఎస్ఈసీ)ను ఏర్పాటు చేసేందుకు సంస్థ ముందుకొచ్చింది. డబ్లిన్, మ్యూనిక్, మలాగా, టోక్యో తర్వాత ప్రపంచంలోనే ఐదో సేఫ్టీ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నది. ఆసియా పసిఫిక్ రీజియన్‌లో జపాన్ తర్వాత ఇది రెండో సెంటర్ కావడం విశేషం. ఈ మేరకు బుధవారం సీఎం రేవంత్ రెడ్డితో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో సంస్థ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రాయల్ హాన్సెన్ నేతృత్వం లోని ప్రతినిధులు సమావేశమయ్యారు.
మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ ఏర్పాటు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. జీఎస్ఈసీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని చెప్పారు. ఐటీ, ఇన్నోవేషన్ హబ్‌లో హైదరాబాద్ లీడర్ అని నిరూపించేందుకు ఈ ఒప్పందమే నిదర్శనమని పేర్కొన్నారు. డిజిటల్ స్కిల్ డెవలప్మెంట్లో తెలంగాణ ఎప్పుడూ ముందుం టుందని చెప్పారు.ఐటీ, ఐటీ ఇంజినీరింగ్ సర్వీసెస్‌లో ప్రపంచ దేశాలకు హైదరాబాద్ గమ్య స్థానమని తెలిపారు. ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, యాపిల్, అమెజాన్, మెటా వంటి టాప్ 5 సంస్థలు ఇప్పటికే హైదరాబాద్‌లో తమ ఆఫీసులను ఏర్పాటు చేశాయని చెప్పారు.
ఈ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్‌తో ప్రపంచం ఎదుర్కొంటున్న సైబర్ సెక్యూరిటీ సమస్యలకు పరిష్కారం చూపేందుకు వీలవుతుందని అన్నారు. దేశంలో సైబర్ సెక్యూరిటీకి తీసుకుంటున్న చర్యల్లో హైదరాబాద్ లీడర్‌గా ఉందని పేర్కొన్నారు. గూగుల్‌తో ఒప్పందం వల్ల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో రీసెర్చ్, ట్రైనింగ్, ఇన్నోవేషన్‌కు తోడ్పాటునందించేలా టెక్నలాజికల్ ఎకో సిస్టమ్ ఏర్పాటుకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. రాష్ట్రాన్ని డిజిటలైజ్ చేయడంలో భాగంగా టీ ఫైబర్ ద్వారా 47 లక్షల గ్రామీణ కుటుంబాలకు కనెక్టివిటీని ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, గూగుల్ ఒప్పందంతో ఆయా ఇండ్లకు డిజిటల్ సేఫ్టీని అందించినట్టు అవుతుందని తెలిపారు.
ఎంతో ఆనందంగా ఉంది : రాయల్ హాన్సెస్
హైదరాబాద్‌లో సేఫ్టీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని గూగుల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రాయల్ హాన్సెన్ అన్నారు. సేఫ్టీ ఇంజినీరింగ్‌లో ప్రపంచానికి హైదరాబాద్ రాజధానిగా ఎదిగేందుకు అన్ని హంగులూ ఉన్నాయని తెలిపారు. డిజిటల్ సెక్యూరిటీ విషయంలో ప్రపంచ అవసరాలను తీర్చేందుకు ఈ సెంటర్ దోహదం చేస్తుందని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. కాగా, మన దేశ అవసరాలకు తగ్గట్టుగా ఆన్లైన్ సేఫ్టీ, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ టూల్స్‌ను ఈ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ ద్వారా అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు.
కాగా, జీఎస్ఈసీ ద్వారా అత్యాధునిక పరిశోధనతోపాటు ఏఐ సాంకేతికత ఆధారంగా సైబర్ సెక్యూరిటీకి పరిష్కారాలను చూపనున్నారు. సైబర్ సెక్యూరిటీలో నిపుణులు, రీసెర్చర్లను ఒకే ప్లాట్‌ఫాంపైకి తీసుకురానున్నారు. సైబర్ సెక్యూరిటీ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు యువతలో నైపుణ్యాలను పెంచడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం వంటి అంశాలపైనా ఈ కేంద్రం దృష్టి సారించనున్నది. గూగుల్ హెడ్ క్వార్టర్స్ తర్వాత ప్రపంచంలోనే అతి పెద్ద క్యాంపస్‌ను సంస్థ హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేయనుండడం విశేషం.
మరిన్ని అంశాలపైనా చర్చ..
సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ ఏర్పాటుతో పాటు మరిన్ని అంశాలపైనా గూగుల్‌తో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు చర్చలు జరిపారు. అత్యాధు నిక సామర్థ్యాలతో క్లౌడ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, ప్రభుత్వంతో కలిసి గూగుల్ పవర్డ్ ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు వంటి వాటిపై మాట్లాడారు. ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్ట మ్ ద్వారా గూగుల్ మ్యాప్స్, ఏఐ, లైవ్ కెమెరా స్ట్రీమ్ డేటా మేనేజ్మెంట్, రియల్ టైం ట్రాఫిక్ సిగ్నలింగ్ మేనేజ్మెంట్ వంటి వాటిని అనుసంధా నించేందుకు వీలవుతుంది.
గ్లోబల్ స్మార్టెస్ట్ సిటీగా హైదరాబాద్ ఫ్యూచర్ సిటీని రూపుదిద్దడంలో ఉన్న అవకాశాలపై చర్చించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను సమూలంగా మార్చేసేందుకు ప్రభుత్వంతో కలిసి మెరుగైన వ్యవస్థలను ఏర్పాటు చేయడం, స్టార్టప్ ఎకో సిస్టమ్‌ను మరింత వృద్ధి చేసేలా గూగుల్ స్టార్టప్ హబ్ ఏర్పాటు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి మద్దతు, యువతలో ఏఐ, సైబర్ సెక్యూరిటీ స్కిల్స్‌ను పెం పొందించడం వంటి అంశాలపైనా గూగుల్ సంస్థతో ప్రభుత్వం చర్చలు జరిపింది.