కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రిలయన్స్ జియో గుడ్ న్యూస్ ప్రకటించింది. ఇతర నెట్ వర్క్ లకు వసూలు చేసే ఇంటర్ కనెక్ట యూసేజ్ చార్జీ (యూఐసీ)లు తొలగించింది. ఇప్పటి వరకు జియో నుంచి ఇతర నెట్ వర్క్ లకు ఫోన్ చేస్తే.. నిమిషానికి 6 పైసలు చొప్పున యూఐసీ చార్జీ వసూలు చేసేది. లైఫ్ టైం ఫ్రీ కాల్స్ నినాదంగా పెట్టుకుని మొబైల్స్ మార్కెట్లోకి అడుగుపెట్టిన జియో.. సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రత్యర్థి కంపెనీలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ట్రాయ్ యూఐసీ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. జియో నెట్ వర్క్ కు ఈ చార్జీలు ఆర్ధిక భారం కావడంతో యూసేజీ చార్జీలు వసూలు చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడిందని అప్పట్లో జియో ప్రకటించింది. ఒకవేళ భవిష్యత్తులో యూసేజీ చార్జీలు ఎత్తేస్తే.. జియో మళ్లీ ఉచిత కాల్స్ అందిస్తుందని జియో స్పష్టం చేసింది. అయితే కేంద్రం జనవరి 1, 2021 నుండి యూఐసీ చార్జీలు ఎత్తేసింది. దీంతో గతంలో ప్రకటించిన మేరకు జియో తన కస్టమర్లకు మళ్లీ ఉచిత కాల్స్ సదుపాయం కల్పిస్తున్నట్లు ఇవాళ తాజా ప్రకటన విడుదల చేసింది.
