జస్టిస్ ఎన్వీ రమణ మంచి మనిషి.. మంచి జడ్జి

జస్టిస్ ఎన్వీ రమణ మంచి మనిషి.. మంచి జడ్జి

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణపై కేంద్ర ప్రభుత్వ లాయర్, సోలిసిటర్‌‌ జనరల్ తుషార్ మెహతా ప్రశంసలు కురిపించారు. శనివారం ఢిల్లీలో బార్‌‌ కౌన్సిల్ ఆఫ్​ ఇండియా సీజేఐని ఘనంగా సన్మానించింది. ఈ సన్మాన సభలో తుషార్ మాట్లాడారు. జస్టిస్ ఎన్వీ రమణ కేవలం ఒక జడ్జిగానే కాక మానవత్వ విలువలున్న వ్యక్తిగానూ తనకు పరిచయమని తుషార్ మెహతా అన్నారు. ఆయన మంచి జడ్జి, అలాగే మంచి మనిషి కూడా అని చెప్పారు. “సీజేఐ ఎన్వీ రమణ దేవుడంటే భయంతో ఉండే వ్యక్తి కాదు.. ఆయన దేవుడిని ప్రేమించే మనిషి. న్యాయ శాస్త్రంలో ఎంతో నిపుణుడు. పారదర్శకంగా పని చేసే వ్యక్తి. మా న్యాయవాద కుటుంబానికి ఆయనే పెద్దదిక్కు లాంటి వారు” అని తుషార్ మెహతా అన్నారు. 

క్షమించాలంటూనే అదే రిక్వెస్ట్..

న్యాయవాదులకు ఉన్న ఓ అలవాటు విషయంలో క్షమించాలంటూ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను తుషార్ మెహతా సరదా రిక్వెస్ట్ చేశారు. ఇది సీజేఐ సన్మాన సభ అయినప్పటికీ బార్‌‌ కౌన్సిల్ ఆఫ్​ ఇండియా చైర్మన్ ఎంకే మిశ్రా మాత్రం కరోనా నేపథ్యంలో లాయర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా ప్రసంగించారని, అది కోర్టయినా, ఆడిటోరియం అయినా సమస్యలను పరిష్కరించాలని కోరడం లాయర్లకు ఉన్న అలవాటు అని చెప్పారు. ఈ విషయంలో క్షమించాలంటూనే అయినప్పటికీ తాను కూడా ఆ సమస్యలను పరిష్కరించాలని మిమ్మల్ని (జస్టిస్ ఎన్వీ రమణను) కోరుతున్నానంటూ సరదగా ప్రసంగాన్ని ముగించారు మెహతా.