పెట్టుబడుల సాధనకు విదేశాల పర్యటన, ప్రతిశాఖపై సమగ్ర సమీక్ష, ఆయా శాఖలు సాధించాల్సిన లక్ష్యాలపై దిశానిర్దేశం, టీజీపీఎస్సీ ప్రక్షాళన. 25.35 లక్షల రైతు కుటుంబాలకు చెందిన రూ. 20,616 కోట్ల రుణమాఫీ, సీతారామ ఎత్తిపోతల మొదటి దశకు ప్రారంభోత్సవం, ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాల అమలు, శాసనసభలో పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా చర్చలు, కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధులపై ప్రధాని మొదలు కేంద్ర మంత్రుల వరకు వినతులు, బహిరంగ సభలు. పార్టీ విధులు, విపక్షాల తప్పుడు విమర్శలకు మాటల తూటాలతో జవాబు. ఇవన్నీ చూడగానే గుర్తుకొచ్చేది ఒక్కరే. ఆయనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కేవలం ఏడాది కాలంలోనే రాష్ట్ర పాలనపై తనదైన ముద్ర వేసిన ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి.
ప్రజా సమస్యలపై పోరు, తనదైన పని తీరుతో జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి రేవంత్ రెడ్డి ఎదిగారు. ప్రమాణ స్వీకారం చేసిన వేదిక నుంచే రజనీ అనే దివ్యాంగురాలికి ఉద్యోగం కల్పిస్తూ ఫైలుపై సంతకం చేశారు. నాటి నుంచి ప్రతి క్షణం తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా పరితపిస్తున్నారు.
పదేండ్ల అవినీతి, అక్రమాల బీఆర్ఎస్ పాలనతో రాష్ట్రం ఆర్థికంగా కుదేలైంది. పాలనా వ్యవస్థ అచేతనంగా మారిన వేళ రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టారు. తెలంగాణను అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. విద్య, వైద్యం, శాంతిభద్రతలు, పరిశ్రమలు, క్రీడారంగం, కృత్రిమ మేధ, పర్యాటకం.. ఇలా ప్రతిరంగంలో ప్రపంచస్థాయిలో తెలంగాణను నిలబెట్టేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు.
నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ సాగిన తెలంగాణ ఉద్యమ రణ నినాదాలను సీఎం రేవంత్ రెడ్డి అర్థం చేసుకున్నంతగా మరెవరూ అర్థం చేసుకోలేదు. అందుకే, పేపర్ లీక్‌లతో అసమర్థతకు చిరునామాగా మారిన టీజీపీఎస్సీ ప్రక్షాళనకు నడుంబిగించారు.
ప్రమాణ స్వీకారం చేసిన నెలలోపే టీజీపీఎస్సీపై సమీక్ష నిర్వహించడంతోపాటు ఢిల్లీ వెళ్లి స్వయంగా యూపీఎస్సీ చైర్మన్‌తో భేటీ అయ్యారు. నియామకాల ప్రక్రియ సక్రమంగా సాగాలంటే సమర్థులు, సచ్చీలురే బోర్డులో ఉండాలని దానిని ప్రక్షాళన చేశారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు.
కమీషన్లు దండుకోవడమే బీఆర్ఎస్ లక్ష్యం
కమీషన్లు దండుకోవడమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు రీడిజైన్ చేసింది. కాళేశ్వరం పేరిట హడావుడి చేసి రూ.కోట్లు దిగమింగింది. నాసిరకం పనులతో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయి కేసీఆర్ కుటుంబ సభ్యుల అవినీతిని బట్టబయలు చేసింది. దానిపై జ్యుడిషియల్ విచారణకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
మరోవైపు బీఆర్ఎస్ పాలనా కాలంలో విస్మరణకు గురైన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల, సీతారామ ఎత్తిపోతల, దేవాదుల ఎత్తిపోతల, ఏఎమ్మార్ ఎస్సెల్బీసీ పనులను సీఎం వేగవంతం చేయించారు. సీతారామ ఎత్తిపోతల మొదటి దశను ప్రారంభించారు. కరువు కోరల్లో నలిగిపోతున్న కొడంగల్, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగు నీరు ఇచ్చే కొడంగల్–నారాయణపేట ఎత్తిపోతల పథకం పనులను రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
కేసీఆర్ తన రాజకీయ ప్రయోజనాల కోసం కొంత కాలం కేంద్ర ప్రభుత్వ పెద్దలతో అంటకాగడం, ఎన్నికల ప్రయోజనాల కోసం దూరంగా ఉన్నట్టు నటించడం, కొన్నిసార్లు వ్యక్తిగత దూషణలు చేశారు. వాటన్నింటికి దూరంగా తెలంగాణ ప్రయో జనాలే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు.
ఫలితమే రీజినల్ రింగు రోడ్డు సహా పలు జాతీయ రహదారులకు మార్గం సుగమం కావడంతో పాటు హైదరాబాద్‌లో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రక్షణ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ అయ్యాయి. దీంతో ఎలివేటెడ్ కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఏటీసీలుగా ఐటీఐలు
రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, మూసీ ప్రక్షాళన, ఫోర్త్ సిటీ ఏర్పాటు వంటివి పురుడుపోసుకున్నాయి. పురాతన కోర్సుల ఐటీఐలను అధునాతన కోర్సులతో అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్లు (ఏటీసీ)గా మార్చివేస్తున్నారు. ఇందుకు టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ తో(టీటీఎల్) ఒప్పందం కుదు ర్చుకున్నారు. రాష్ట్రంలోని 65 ఐటీఐలను ఏటీసీలుగా మార్చేందుకు టీటీఎల్ రూ.2,016.25 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.307.96 కోట్లు వ్యయం చేయనున్నాయి.
ఈ ఏటీసీల నుంచి రానున్న పదేండ్లలో 4.70 లక్షల మంది వృత్తి నిపుణులు బయటకు రానున్నారు. తమ నైపుణ్యాలతో దేశ, విదేశాల్లో కొలువులు సాధించి ఆర్థికంగా స్థిరపడడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిపుణుల కొరతను వారు తీర్చనున్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఆనంద్ మహీంద్ర, శ్రీనివాసరాజులను చైర్మన్, వైస్ చైర్మన్‌గా సీఎం రేవంత్ రెడ్డి నియమించారు. ఈ ఏడాదే కోర్సుల ప్రారంభానికి చర్యలు తీసుకున్నారు.
స్వతహాగా ఫుట్‌బాల్ క్రీడాకారుడైన రేవంత్ రెడ్డి క్రీడల ప్రాధాన్యాన్నిగుర్తించారు. అందుకే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు కంకణం కట్టుకున్నారు. రాబోయే ఒలింపిక్స్‌లో పతకాలే లక్ష్యంగా అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.
థేమ్స్ తరహాలో మూసీ
మూసీని సైతం థేమ్స్ తరహాలో తీర్చిదిద్దేందుకు ప్రణాళిక ఖరారైంది. ప్రపంచాన్ని శాసిస్తున్న కృత్రిమ మేధకు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ) సైతం హైదరాబాదే రాజధాని కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షిస్తున్నారు. అందుకే ఫోర్త్ సిటీలో ఏఐ సిటీకి పెద్దపీట వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏఐపై ప్రపంచస్థాయి సదస్సును సెప్టెంబరు 5, 6 తేదీల్లో నిర్వహించారు. కాగా, రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలకు సాగు రంగమే జీవనాధారం.
అందుకే అన్నదాతలను ఆదుకోవాలనే లక్ష్యంతో రూ.2 లక్షల రుణమాఫీని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం పూర్తి చేసింది. 25.35 లక్షల రైతు కుటుంబాలకు చెందిన రూ. 20,616 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. భారత దేశ చరిత్రలోనే ఏడాది కాలంలోనే ఇంత పెద్ద మొత్తం రైతు రుణాలు మాఫీ చేసిన చరిత్ర ఏ రాష్ట్రానికీ లేదు.
ప్రజాసంక్షేమం కోసం క్షణం తీరిక లేకుండా పని చేస్తూ ప్రతి అంశంలోనూ తనదైన ముద్ర వేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విషం చిమ్మడాన్ని ప్రతి పక్షాలు ఇకనైనా ఆపాలి. తెలంగాణ బిడ్డల ఉజ్వల భవిష్యత్తుకు నిత్యం పరితపిస్తున్న ప్రజా నాయకుడు రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రజలంతా అండగా నిలవాలి.
ప్రపంచస్థాయి ఫోర్త్‌సిటీకి రూపకల్పన
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో పెట్టుబడుల సాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరై పలు బహుళ జాతి కంపెనీల ప్రతినిధులతో భేటీ అయి పెట్టుబడులకు ఒప్పించారు. ఇటీవల అమెరికా, దక్షిణ కొరియాల్లో పర్యటించి దిగ్గజ కంపెనీలను సందర్శించి పెట్టుబడుల సాధనకు మార్గం సుగమం చేశారు.
నూతన పరిశ్రమల స్థాపనకు వీలుగా నాలుగో నగరానికి (ఫోర్త్ సిటీ) రూపకల్పన చేస్తున్నారు. ఆధునిక పరిశ్రమలు, ప్రపంచస్థాయి మౌలిక వసతులతో ఈ నాలుగో నగరం రూపుదిద్దుకోనుంది. ఒకప్పుడు తాగు నీటి వనరుగా ఉన్న మూసీ మురికికూపంగా మారింది. దీంతో ఆక్రమణల అంతు తేల్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారు. పలు చెరువులు ఆక్రమణదారుల కబంధ హస్తాల నుంచి బయటపడుతున్నాయి. హైడ్రా పనితీరును ప్రజలు మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు.
- దూదిపాళ్ల విజయ్ కుమార్ , సీఎం పీఆర్ఓ-