నన్ను కావాలనే బయటికి గెంటేశారు - గొల్లపల్లి..!

టీడీపీ మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఘోరంగా అవమానించాడని, కావాలనే పార్టీ నుండి తనను గెంటేశారని అన్నారు. జగన్ తనను అక్కున చేర్చుకున్నాడని అన్నారు. 2024 ఎన్నికల్లో తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో టీడీపీకి రాజీనామా చేసిన ఆయన బుధవారం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

టీడీపీ, జనసేన ఉమ్మడి జాబితా పరకటించిన తర్వాత ఇరు పార్టీల్లో అసమ్మతి సెగ రాజుకున్న క్రమంలో గొల్లపల్లి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నిబద్దతతో పనిచేసిన తనను పార్టీ తీవ్రంగా అవమానించిందని, పార్టీ స్థాపించిన నాటి నుండి పదవి ఉన్నా లేకున్నా పార్టీకి క్రమశిక్షణతో పని చేసిన తనను మెడ పట్టుకు గెంటేసినంత పని చేశాడని చంద్రబాబుపై మండిపడ్డాడు.

సుమారు 40ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడని అవమానాలు 2014 నుండి 19వరకు టీడీపీ ప్రభుత్వంలో చూశానని, అయినప్పటికీ అన్నీ భరిస్తూ పార్టీ కోసం పని చేస్తూ వచ్చానని అన్నారు. 2019లో ఓడిపోయిన నాటి నుండి కూడా ఎన్నో ప్రతికూలతలు ఎదుర్కొంటు పార్టీని కాపాడుకుంటూ వచ్చానని, అయినా తన శ్రమను చంద్రబాబు గుర్తించలేదని అన్నారు.