కేరళ రాష్ట్రంలో బంగారం స్మగ్లింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వప్న సురేశ్ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం పినరయి విజయన్ ఆయన కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన భార్య కమల, కూతురు వీణ, అప్పటి మంత్రి కేటీ జలీల్, సీఎం వ్యక్తిగత కార్యదర్శి రవీంద్రన్ ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ కేసులో తన ప్రమేయం గురించి కొచ్చి కోర్టుకు తెలియచేయడం జరిగిందన్నారు. 2016లో సీఎం దుబాయ్ పర్యటన సందర్భంగా.. మాజీ ప్రిన్స్ పల్ సెక్రటరీ ఎం. శివశంకర్ తనను సంప్రదించడం జరిగిందని, సామానును అక్కడకు పంపించాలని కోరినట్లు ఆరోపించారు. దుబా య్ లోని కాన్సులేట్ లోని ఓ దౌత్య అధికారికి తాను బ్యాగు ఇవ్వడం జరిగిందని, అక్కడ స్కానింగ్ నిర్వహించగా..బ్యాగులో డబ్బు ఉందన్నారు. అప్పటి నుంచి బంగారం స్మగ్లింగ్ వ్యాపారం మొదలైందని చెప్పారు.
దుబాయి కాన్సులేట్ నుంచి నివాసానికి ఓ పాత్రలో విలువైన లోహాలను తరలించారని, కోర్టు ఆదేశాలకు మేరకు ఈడీ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించలేమని వ్యాఖ్యానించారు. తనకు ప్రాణహాని ఉందని..అందుకే ఈ కేసుకు సంబంధించిన అన్ని వాస్తవాలను కోర్టు ముందు వెల్లడిస్తానన్నారు.
2020, జూలై 11న బెంగళూరుకు చెందిన మరో నిందితుడు సందీప్ నాయర్ తో పాటు కొచ్చిలోని యూఏఈ కాన్సులేట్ మాజీ ఉద్యోగి స్వప్న సురేశ్ ను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అరెస్టు అయిన 16 నెలల తర్వాత గతేడాది నవంబర్ లో ఆమె జైలు నుంచి విడుదలైంది. 2020 జూలై 05న తిరువనంతపురం విమానాశ్రయంలోని యూఏఈ (UAE) కాన్సులేట్ లో రూ. 15 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకోవడంతో స్మగ్లింగ్ రాకెట్ గుట్టురట్టైంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేత సతీషన్ డిమాండ్ చేశారు.
