స్టిమ్యులస్ ప్యాకేజీలతో బంగారానికి డిమాండ్
తగ్గిన వడ్డీరేట్లు, ఈజీ లిక్విడిటీ సపోర్ట్
ఆగస్ట్‌లో 56 వేలు తాకిన గోల్డ్
ముంబై : కొత్త ఏడాదిలో కూడా బంగారం ధర పరుగులు పెట్టనుంది. 10 గ్రాముల బంగారం ధర వచ్చే ఏడాది రూ.63 వేలను తాకుతుందనే అంచనాలున్నాయి. అమెరికన్ డాలర్ బలహీనపడుతుండటం, తాజాగా ప్రభుత్వాలు ప్రకటిస్తోన్న స్టిమ్యులస్ ప్యాకేజీలతో గోల్డ్ మరింత బలపడనుందని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. అనిశ్చిత పరిస్థితుల్లో గోల్డ్‌ను సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావిస్తారు. కరోనా మహమ్మారితో 2020లో ఎకనామిక్‌గా, సోషల్‌గా ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గోల్డ్ మెరిసింది. 10 గ్రాముల బంగారం ధర ఎంసీఎక్స్‌లో ఆల్ టైమ్ హై రూ.56,191ను తాకింది. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో అయితే ఆగస్ట్‌లో ఒక ఔన్స్ 2,075 డాలర్ల మార్క్‌ను అధిగమించింది.
వడ్డీ రేట్లను తగ్గిస్తూ సెంట్రల్ బ్యాంక్‌లు తమ మానిటరీ పాలసీలను ప్రకటించడం, లిక్విడిటీ అందుబాటులో ఉంచడం వంటివి గోల్డ్ ధరలకు బూస్టప్‌ను ఇస్తున్నాయి. ‘ఈ ఏడాది ప్రారంభంలో దేశీయంగా గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.39,100 వద్ద ఉండేది. ఇంటర్నేషనల్‌గా ఒక ఔన్స్ 1,517 డాలర్లు పలికింది. కానీ కరోనా లాక్‌డౌన్‌తో దేశీయంగా తొలుత గోల్డ్ ధర కనిష్ట స్థాయి రూ.38,400కు పడిపోయి, ఆ తర్వాత నుంచి దూసుకుపోవడం ప్రారంభించింది. ఆల్ టైమ్ హై మార్క్ రూ.56,191ను తాకింది. స్టిమ్యులస్ ప్యాకేజీలు దేశీయ మార్కెట్‌లో గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్లను పెంచుతున్నాయి’ అని కామ్‌ట్రెండ్జ్ రిస్క్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ సీఈవో జ్ఞానశేఖర్ త్యాగరాజన్ అన్నారు. కరోనా తర్వాత ఎకనమిక్ రివైవల్ ప్రారంభం కావడం, వైరస్‌కు వ్యాక్సిన్లు రావడం వంటి పరిణామాలు ఉన్నప్పటికీ గోల్డ్ అవుట్‌లుక్ పాజిటివ్‌గానే కనిపిస్తోందని పేర్కొన్నారు.
ముఖ్యంగా ప్రభుత్వాలు తాజాగా స్టిమ్యులస్ ప్యాకేజీలు ప్రకటిస్తాయనే అంచనాలతోనే గోల్డ్ పరుగులు పెడుతోంది. దానికి తోడు కరోనా 2.0 కూడా గోల్డ్‌కు మద్దతుగా నిలుస్తోంది. మరిన్ని స్టిమ్యులస్ ప్యాకేజీలు వస్తే డాలర్ మరింత బలహీనపడుతుందని, గోల్డ్ ధరలు మరోసారి పెరుగుతాయని త్యాగరాజన్ చెప్పారు. 2021లో ఇన్వెస్ట్‌మెంట్ల కొనుగోళ్లకు గోల్డ్ మరింత ఆకర్షణీయంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు అమెరికా ఎన్నికల్లో గెలుపొందిన జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌కు సెనేట్‌లో తగినంత మెజార్టీ లేదు. ఏదైనా సంస్కరణలు ప్రవేశపెట్టాలంటే కాస్త కష్టంతో కూడుకున్నదై ఉంటుంది. ఈ పొలిటికల్ రిస్క్ కూడా బులియన్ రేట్లు పైకి వెళ్లేందుకు సహకరిస్తుందని వివరించారు. సెంట్రల్ బ్యాంక్‌లు మార్కెట్లలోకి అందిస్తోన్న లిక్విడిటీతో ఇన్వెస్టర్లు గోల్డ్ వైపుకి చూస్తున్నారని ఇన్వెస్ట్‌మెంట్ కన్సల్టింగ్ కంపెనీ మిల్‌వూడ్ కానే చెప్పారు. వడ్డీ రేట్లు తగ్గించడం, తేలికగా లిక్విడిటీ అందేలా చేయడం వంటివి గోల్డ్‌కు సపోర్ట్ ఇస్తున్నాయని పేర్కొన్నారు.
వచ్చే ఏడాది బుల్లిష్ ట్రెండ్..
ఇండియా, చైనాలో గత కొన్నేళ్లుగా బలహీనంగా ఉన్న గోల్డ్ ఫిజికల్ డిమాండ్.. వచ్చే ఏడాది స్ట్రాంగ్‌గా కోలుకోనుందని త్యాగరాజన్ పేర్కొన్నారు. 2021లో ధరలు దేశీయంగా రూ.60 వేలకు పైగా, ఇంటర్నేషనల్ మార్కెట్‌లో 2,200 డాలర్ల మార్క్‌కు చేరతాయని అంచనావేస్తున్నారు. ఈ సమయంలో రూపాయి వాల్యు స్థిరంగా ఉంటుందని పేర్కొన్నారు. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్(కమోడిటీస్) తపన్ పటేల్ చెప్పిన దాని ప్రకారం వచ్చే ఏడాది కూడా గోల్డ్‌కు బుల్లిష్ ట్రెండ్ ఉంటుంది. కామెక్స్ గోల్డ్‌లో 2,150 డాలర్ల నుంచి 2390 డాలర్ల టార్గెట్‌ను ఇది చేరుకుంటుందని పటేల్ పేర్కొన్నారు. అదేవిధంగా ఎంసీఎక్స్‌లో ఈ టార్గెట్లు రూ.57 వేలుగా, రూ.63 వేలుగా ఉన్నట్టు పటేల్ చెప్పారు. ఎకానమీలు, లేబర్ మార్కెట్లు కోలుకోవడం చాలా నెమ్మదిగా సాగుతుండటం, పెద్ద మొత్తంలో స్టిమ్యులస్ చర్యలు గోల్డ్ ధరలు పెరగడానికి కారణంగా నిలుస్తాయని చెప్పారు. రూపాయి పతనం, ఈక్విటీ మార్కెట్లు నష్టపోవడంతో ఈ ఏడాది గోల్డ్ ధరలు విపరీతంగా పెరిగాయి.
పెళ్లిళ్ల సీజన్‌లో కాస్త రికవరీ…
లాక్‌డౌన్స్‌తో లాజిస్టిక్ సమస్యలు తలెత్తడం, ధరలు పెరగడం వంటివి కన్జూమర్ డిమాండ్‌పై ప్రభావితం చూపినట్టు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ మేనేజింగ్ డైరెక్టర్(ఇండియా) సోమసుందరమ్ పీఆర్ చెప్పారు. సెప్టెంబర్ క్వార్టర్ నాటికి ఇండియాలో డిమాండ్ 49 శాతం తగ్గింది. అయితే అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్‌లో కాస్త రికవరీ సాధించింది. లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తివేయడం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ క్వార్టర్‌లో అంతకుముందు క్వార్టర్‌తో పోలిస్తే కాస్త ఫిజికల్ డిమాండ్ వచ్చింది. కానీ 2019 నాటి స్థాయిల కంటే తక్కువగానే ఈ డిమాండ్ నమోదైంది. 20 ఏళ్ల కాలంలో డిమాండ్ అతి తక్కువగా నమోదు కావడం ఇది రెండోసారి.
