తిరుమలలో గోల్డ్ మ్యాన్.. స్వామివారికి పోటీగా బంగారం

తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం క్యూలో ఉన్నప్పుడు ఆ స్వామివారి నామస్మరణ తప్పించి వేరే ధ్యాస ఉండదు. స్వామివారిని ఎప్పుడెప్పుడు దర్శించుకుంటామా అన్న అతృతతో పక్కన ఏం జరిగినా కూడా పట్టించుకోనంత లీనమై ఉంటారు గోవింద నామ జపంలో. అలాంటిది, ఒక వ్యక్తి క్యూ లైన్లో వేచి ఉన్న భక్తజనాన్ని తనవైపు తిప్పుకునేలా చేశాడు. అతను ధరించిన అభరణాలు చూసిన భక్తులు ఆకర్షితులు అయ్యారు.

భక్తులందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన సదరు గోల్డ్ మ్యాన్ ఎవరంటే, గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన గడ్డిపాటి సాంబశివరావుగా తెలుస్తోంది. శుక్రవారం తిరుమల చేరుకున్న ఈయన ఒంటి మీద 3కేజీల బంగారంతో సందడి చేశాడు.రెండు చేతుల్లో వేళ్లకు సరిసమానంగా చేతి ఉంగరులు.,రెండు చేతులకు  భారీ కంకణాలు., మెడలో పెద్ద చైన్లతో పాటుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమతో కూడిన డాలర్ ను ధరించారు. 3 కేజీల బరువు గల బంగారు అభరణాలు ధరించి హల్చల్ చేసిన ఈయనతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.