దిగొస్తున్న బంగారం, వెండి ధరలు.. నిన్న ఒక్కరోజే భారీగా పతనం

  • రూ.1,750 తగ్గిన బంగారం ధర
  • వెండి ధర రూ.2,700 పతనం

న్యూఢిల్లీ: వ్యాపారుల నుంచి  డిమాండ్ తగ్గడం,  అంతర్జాతీయ మార్కెట్లోనూ గిరాకీ పడిపోవడంతో దేశ రాజధానిలో మంగళవారం బంగారం, వెండి ధరలు వరుసగా రెండవ రోజు తగ్గాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది.  99.9 శాతం స్వచ్ఛత కలిగిన విలువైన 10 గ్రాముల పసిడి ధర రూ.1,750 తగ్గి రూ.77,800కి పడిపోయింది. క్రితం సెషన్‌‌‌‌‌‌‌‌లో 10 గ్రాముల ధర రూ.79,550 వద్ద ముగిసింది. వెండి కూడా కిలోకు రూ.2,700 క్షీణించి రూ.91,300కి చేరుకుంది. క్రితం ముగింపు కిలో రూ.94 వేలుగా ఉంది. 99.5 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.1,750 తగ్గి రూ.77,400కి చేరుకుంది. సోమవారం 10 గ్రాముల ధర రూ.79,150 వద్ద స్థిరపడింది. 

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో ఫ్యూచర్స్ ట్రేడ్‌‌‌‌‌‌‌‌లో, డిసెంబర్ డెలివరీ కోసం బంగారం కాంట్రాక్టులు రూ. 612  పడిపోయి, 10 గ్రాములకు రూ.74,739 వద్ద ట్రేడవుతున్నాయి.  డిసెంబర్ డెలివరీ కోసం వెండి కాంట్రాక్టులు రూ.742  క్షీణించి, ఎంసీఎక్స్​లో కిలోకు రూ.88,440కి పడిపోయాయి.  విదేశీ మార్కెట్లలో, కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్‌‌‌‌‌‌‌‌కు 19.90 డాలర్లు లేదా 0.76 శాతం పడిపోయి ఔన్స్‌‌‌‌‌‌‌‌కు 2,597.80 డాలర్లకు చేరింది.   అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో డాలర్ ర్యాలీ కొనసాగుతోందని, దీంతో బంగారం ధరలు తగ్గుతున్నాయని హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ సెక్యూరిటీస్‌‌‌‌‌‌‌‌లోని కమోడిటీస్ సీనియర్ విశ్లేషకుడు సౌమిల్ గాంధీ చెప్పారు.   ఆసియా మార్కెట్ అవర్స్‌‌‌‌‌‌‌‌లో కామెక్స్​ సిల్వర్ ఫ్యూచర్స్ 0.6 శాతం తగ్గి ఔన్సుకు  30.43 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.  అబాన్స్ హోల్డింగ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చింతన్ మెహతా మాట్లాడుతూ డాలర్ ఇండెక్స్ నాలుగు -నెలల గరిష్ట స్థాయికి పెరగడంతో బంగారం ధరలు బలహీనంగా ఉన్నాయని చెప్పారు.