రాజేంద్రనగర్లో దొంగల బీభత్సం.. పట్టపగలే ఇంట్లోకి చొరబడి బంగారం, డబ్బు చోరీ

రాత్రి, పగలు అని తేడా ఏం లేదు.. అనుకుంటే ఎప్పుడైనా కొట్టేయాల్సిందేనని నిర్ణయించుకున్నట్లు ఉన్నారు ఈ దొంగలు. ఎక్కువగా తాళం వేసి ఉన్న ఇళ్లనే దొంగలు టార్గెట్ చేస్తుంటారు.. కాని,  ఇంట్లో వాళ్లు ఉన్నారనే భయం కూడా లేకుండా.. పట్టపగలే ఇంట్లోకి చొరబడి దోచుకెళ్లారు.  ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో చోటుచేసుకుంది. ఉదయం 10 గంటల సమయంలో ఓ ఇంట్లోకి చోరబడి అందిన కాడికి దోచుకున్న దుండగులు.  ముఖానికి మాస్క్ ధరించి దర్జాగా ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు.. ఇంట్లో ఉన్న వస్తువులను చిందర వందరగా పడేసి అల్మారాలో ఉన్న బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు ఎత్తుకెళ్లారు.  

ఇంట్లో ఉన్న బాలిక.. గట్టిగా కేకలు వేస్తూ పట్టుకునే ప్రయత్నం చేయగా.. బాలికను తోసేసి దుండగులు పారిపోయారు.  వాష్ రూమ్ కు వెళ్లి వచ్చేసరికి.. అందిన కాడికి దోచుకుని బయటకు పరుగులు తీసినట్లు బాధితులు తెలిపారు. అందరూ ఉండగానే.. పక్కింట్లో దొంగలు పడడంతో ఒక్కసారిగా స్థానికులు భయబ్రాంతులను గురయ్యారు. ఈ ఘటనపై వెంటనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనస్థలానికి చేరుకుని పరిశీలంచిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.