హైదరాబాద్లో మటన్ షాపుకు పోతున్నరా? ఈ స్టాంప్​ ఉన్న మాంసం తింటేనే సేఫ్.. చూసి కొనండి..

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో రూల్స్ ​పాటించని చికెన్, మటన్, బీఫ్, ఫిష్ షాపులపై బల్దియా యాక్షన్​ తీసుకుంటోంది. అధికారిక లెక్కల ప్రకారం సిటీలో 7 వేల మాంసం అమ్మే షాపులుండగా, అనధికారికంగా 30 వేల వరకు ఉన్నాయి. ఇందులో చాలా షాపులు పరిశుభ్రత పాటించడం లేదని, స్టాంప్​లేని మాంసం విక్రయిస్తున్నాయని, వ్యర్థాల నిర్వహణ అధ్వానంగా ఉందని చాలా వరకు కంప్లయింట్స్​వస్తుండడంతో వెటర్నరీ అధికారులు తనిఖీలు తీవ్రం చేశారు.

7 వేల షాపుల్లో తనిఖీలు చేయగా, 5,730 షాపులు రూల్స్​పాటించడం లేదని గుర్తించారు. ఎక్కువ షాపులు అపరిశుభ్ర వాతావరణంలో నడుస్తున్నాయని, వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ పడవేస్తున్నారని గుర్తించారు. వీరికి నోటీసులు ఇచ్చి షాపు నిర్వహించే పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. లేకపోతే సీజ్​చేస్తామని వార్నింగ్ ​ఇచ్చారు.

మటన్పై స్టాంప్ లేకపోతే చెప్పండి
ప్రాథమికంగా ట్రేడ్‌ లైసెన్స్‌ ఉన్న షాపులే మటన్‌, చికెన్‌, బీఫ్‌ అమ్మాల్సి ఉంటుంది. మేక, గొర్రె మాంసం అమ్మేవారు అంబర్‌పేట్‌, బోయిగూడ, చెంగిచర్ల, జియాగూడ స్లాటర్‌ కేంద్రాల నుంచి మాత్రమే తెచ్చి అమ్మాలి. ఈ స్టాంప్​ ఉన్న మాంసం తింటేనే సురక్షితం. ఎందుకంటే ప్రతి స్లాటర్ కేంద్రం వద్ద తనిఖీల కోసం నలుగురు వెటర్నరీ అధికారులు ఉంటారు. వీరు జనాలకు హాని కలిగించే అవకాశముండే మాంసానికి అనుమతి ఇవ్వరు. శుభ్రమైన, ఆరోగ్యకరమైన మాంసం ఉంటేనే తనిఖీ చేసి స్టాంప్ వేసి బయటకు పంపిస్తారు. కానీ నగరంలో చాలా మీట్‌ షాపుల్లో ముద్ర లేని మాంసాన్నే ఎక్కువగా అమ్ముతున్నారు.

మేక మాంసం పేరుతో గొర్రె మటన్ ​తీసుకువచ్చి ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు. కొన్ని చోట్ల రెండు మూడు రోజుల పాటు నిల్వ ఉంచిన మటన్​ను, పాడైన మటన్‌ను విక్రయిస్తున్నారు. ఇలాంటివి వేల సంఖ్యలో ఉన్నట్టు గుర్తించారు. ఈ మటన్​తింటే ఆరోగ్యంపై ప్రభావం చూపించే అవకాశం ఉండడంతో స్టాంప్ లేకుండా విక్రయించే షాపుల గురించి సమాచారం ఇవ్వాలని బల్దియా అధికారులు కోరుతున్నారు. అందులో భాగంగానే గుర్తించి నోటీసులు ఇస్తున్నారు.

రోజుకు 500 టన్నుల వ్యర్థాలు 
నగరంలో రోజూ 500 టన్నుల వరకు మాంసపు వ్యర్థాలు ఉత్పత్తవుతున్నాయి. వీటిని ఎక్కడ పడితే అక్కడ పారవేయడంవల్ల సమస్యలు ఏర్పడుతున్నాయి. రోడ్ల పక్కన వేయడంతో  కుక్కలు గుమిగూడుతున్నాయి. అక్కడికి వచ్చే జనాలపై దాడులు చేస్తున్నాయి. పరిసర ప్రాంతాల్లో దర్వాసన వస్తోంది. ఈ నేపథ్యంలో శాస్త్రీయ పద్ధతిలో వ్యర్ధాల నిర్వహణకు బల్దియా ఓ ఏజెన్సీతో ఒప్పందం చేసుకుంది. దీని కోసం పదేండ్లకు ఆ ఏజెన్సీకి  రూ.24 కోట్లు చెల్లిస్తోంది. మాంసం దుకాణాలు వ్యర్థాలను ఈ ఏజెన్సీకే ఇవ్వాలని బల్దియా కోరుతోంది. అయినా వినకుండా ఎక్కడపడితే అక్కడ పారవేస్తున్న వారికి నోటీసులు ఇస్తున్నారు..

అవాక్కయిన మేయర్
గత నెల 22వ తేదీన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆజాద్ మార్కెట్‌ లో ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ రెండు చికెన్ షాపులు అత్యంత అపరిశుభ్ర పరిస్థితుల్లో నిర్వహిస్తున్నట్లు చూసి అవాక్కయ్యారు. ఎలుకలు కూడా తిరుగుతుండడాన్ని చూసి తట్టుకోలేకపోయారు. ఇలాంటి చికెన్​తింటే జనాల ఆరోగ్యం ఏమవుతుందని, ఆ షాపులను సీజ్​చేయాలని ఆదేశించారు. మోతీ మార్కెట్ లో చికెన్ దుకాణాలను పరిశీలించగా అక్కడ కూడా పరిశుభ్రత తాండవిస్తుండడంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలోని వేలాది షాపుల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుండడంతో అధికారులు తనిఖీలు చేసి నోటీసులిస్తున్నారు. షాపులు మారకపోతే సీజ్​చేస్తామని హెచ్చరిస్తున్నారు.