గోబీ మంచురియాపై గోవా యుద్ధం

గోబీ మంచురియాపై గోవా యుద్ధం
  • డిష్​ను నిషేధిస్తున్న అక్కడి స్థానిక సంస్థలు

పనాజీ: గోబీ మంచురియా డిష్​పై గోవా యుద్ధాన్ని ప్రకటించింది. గోబీని అపరిశుభ్ర పరిస్థితుల్లో తయారు చేయడం, ఈ డిష్‌లో ప్రమాదకర కలర్స్ వాడటం, దుస్తులు ఉతకడానికి ఉపయోగించే పౌడర్‌‌ను సాస్‌ తయారీలో వాడటంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో అక్కడి స్థానిక సంస్థలు ఒకదాని తర్వాత మరొకటి ఈ డిష్​పై నిషేధం విధిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రసిద్ధ బోడ్గేశ్వర ఆలయ జాతర వద్ద గోబీ మంచురియాను నిషేధించాలని మపుసా మున్సిపల్  కౌన్సిల్ కౌన్సిలర్  తారక్ ఆరోల్కర్ సూచించారు. 

గత నెలలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, సభ్యులందరూ ఈ తీర్మానానికి ఏకగ్రీవంగా అంగీకరించారు. దీంతో వెంటనే నిషేధం అమల్లోకి వచ్చింది. గోవాలో గోబీపై గతంలోనూ కొన్ని కౌన్సిల్స్ నిషేధం విధించాయి. శ్రీ దామోదర దేవాలయ వాస్కో సప్త జాతరలో గోబీ మంచురియాను విక్రయించే స్లాళ్లను  నియంత్రించాలని 2022లో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్​డీఏ) అధికారులు మోర్ముగావ్ మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోండాలోని కపిలేశ్వరి, సాతేరి దేవి జాతర సమయంలోనూ  గోబీ తయారు చేసే స్టాల్స్‌‌పై ఎఫ్​డీఏ అధికారులు దాడి చేశారు.