ప్రపంచ ఐటీ సంక్షోభం : ఏయే రంగాలు కుప్పకూలాయో తెలిస్తే షాక్ అవుతారు..!

మైక్రోసాఫ్ట్ క్లౌడ్ స‌ర్వీసుల్లో సాంకేతిక స‌మ‌స్య త‌లెత్తడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన విమానయాన సంస్థలు, మీడియా కంపెనీలు, బ్యాంకులు, హెల్త్ కేర్,  టెలికాం సంస్థల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. అమెరికా,ఆస్ట్రేలియా సహా అనేక దేశాల్లో ఆయా సేవలు నిలిచిపోయాయి. విమానయాన సేవలకు సంబంధించి USలో అమెరికన్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్,  భారత్ లో స్పైస్‌జెట్‌, ఇండిగో, ఎయిర్ ఇండియా, విస్తారా, ఆకాశా ఎయిర్ సంస్థలకు చెందిన విమానాల బుకింగ్‌, చెక్ ఇన్‌, అప్‌డేట్స్ అన్నీ గ‌ల్లంతుఅయ్యాయి. అమెరికాకు చెందిన ఫ్రంటైర్ ఎయిర్‌లైన్స్ 147 విమానాల‌ను ర‌ద్దు చేయగా భారత్, ఆస్ట్రేలియా, యూకే , సింగపూర్ సహా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో విమాన సర్వీసులు రద్దవడంతో పాటు పలు వ్యాపారాలకు అంతరాయం ఏర్పడింది.

అమెరికాలోని  న్యూయార్క్ లో రైలు, బస్సు సర్వీసులపై కొంత ప్రభావం పడినట్లు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక అంతరాయం కారణంగా వారి సేవలను ఆఫ్‌లైన్‌లో కొనసాగిస్తున్నట్లు పేర్కొంది.

మరోవైపు ఆస్ట్రేలియాలోని ప్రముఖ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్‌స్ట్రైక్‌లో ఈ సమస్యతో తీవ్ర అంతరాయం ఏర్పడిందని అక్కడి ప్రభుత్వం తెలిపింది. కాగా  క్రౌడ్‌స్ట్రైక్ CEO జార్జ్ Xలో స్పందించారు. తమ సంస్థ సేవల్లో అంతరాయం కలిగిన మాట నిజమేనని.. అది స్వల్ప అంతరాయం మాత్రమే కానీ అది సైబర్‌ అటాక్  కాదని అన్నారు. మరోవైపు ఆస్ట్రేలియాలో, మీడియా, బ్యాంకులు, టెలికాం కంపెనీలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

యూకేలోని బ్రిటీష్ బ్రాడ్‌కాస్టర్ స్కై న్యూస్ ప్రసారాన్ని నిలిపివేసింది. మరోవైపు UKలోని విమాన, రైలు కంపెనీలు వాటి సర్వీసులను రద్దు చేసినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాయి. లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ పై కూడా ఈ ప్రభావం పడినట్లు తెలుస్తోంది. కొన్ని ఆసుపత్రులు అపాయింట్‌మెంట్‌లను ప్రాసెస్ చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు, పలు వ్యాపారాలు చెల్లింపులు నిలిపివేసినట్లు వెల్లడించాయి. 

స్పానిష్, బెర్లిన్‌లోని ప్రధాన విమానాశ్రయాలపై మైక్రోసాఫ్ట్   క్లౌడ్ స‌ర్వీసు డౌన్ ఎఫెక్ట్ పడిందని అక్కడి అధికారులు తెలిపారు. దీంతో ఆయా దేశాల్లో  ఆన్ లైన్ బుకింగ్, చెక్-ఇన్‌లు ఆలస్యం అయ్యాయని, పలు సర్వీసులు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. 

యూరప్‌లోని అతిపెద్ద విమానయాన సంస్థ ర్యానైర్  నెట్‌వర్క్‌లో పనిచేస్తున్న అన్ని ఎయిర్‌లైన్స్ పై ఈ ప్రభావం పడినట్లు అక్కడి సంస్థలు ప్రయాణికులను హెచ్చరించాయి. పోలాండ్ లోని బాల్టిక్ తీరంలో గల గ్డాన్స్క్‌లో షిప్పింగ్ టెర్మినల్ సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు ఆ దేశ సంస్థలు నివేదించాయి. డచ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం డచ్ ప్రెస్ ఏజెన్సీ ANP కూడా ఈ అంతరాయంతో ఇబ్బందులు పడ్డట్లు తెలుస్తోంది. నెట్‌బ్లాక్స్, డిజిటల్-కనెక్టివిటీ, వాచ్‌డాగ్, గ్లోబల్ ఎయిర్‌లైన్స్, కార్పొరేట్లు, బ్యాంకింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడింది.